NTV Telugu Site icon

పాట ఎలా ఉండాలో చెప్పిన ఇళయరాజా!

Ilayaraja

కోట్లాదిమంది పెదాలపై మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ నాట్యం చేస్తూనే ఉంటాయి. వేయికి పైగా చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఇళయరాజా నేటికీ అలుపుసొలుపు లేకుండా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా పాట ఎలా ఉండాలో అలతి పదాలతో వివరించారు ఇళయరాజా. అప్పుడే వికసించిన కుసుమంలా పాట ఉండాలంటారు ఇళయరాజా. అంతేకాదు… ఆ పాటను ఎప్పుడు విన్నా… అదే అనుభూతి శ్రోతలకు కలగాలంటారు. ఆయన పాటలలో అలాంటి తాజాదనం ఉంది కాబట్టే దశాబ్దాలు గడిచిన ఆ పాటలను జనం ఆస్వాదిస్తున్నారనిపిస్తుంది. ఇంతకూ ఈ విషయాలను తెలియచేసింది మరెవరో కాదు ఇళయరాజా శిష్యుడు ఎ. ఆర్. రెహమాన్.

ఇటీవల ఓ తమిళ దిన పత్రికలో ఇళయరాజా పాట గురించి చెప్పిన వ్యాసం ఒకటి ప్రచురితమైంది. దానిని ఎ. ఆర్. రెహమాన్ తన సోషల్ మీడియా అక్కౌంట్ లో ట్యాగ్ చేశారు. ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ విశ్వనాథన్, కె. వి. మహదేవన్, ఇళయరాజా, రాజ్ కోటి తదితరుల దగ్గర వాద్యకారునిగా పనిచేశారు. ఆ సమయంలో సీనియర్ సంగీత దర్శకుల దగ్గర నేర్చుకున్న గొప్ప విషయాలను రెహమాన్ ఆచరణలో పెట్టారు. విశేషం ఏమంటే ఇప్పుడు ప్రపంచం గర్వించే సంగీత దర్శకునిగా రెహమాన్ గుర్తింపు తెచ్చుకున్నా, తన గురువుల గొప్పతనాన్ని మాత్రం విస్మరించలేదనడానికి ఇదే తాజా ఉదాహరణ. రెహమాన్ స్వరాలు సమకూర్చిన ‘మిమి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘హిందుస్తానీ వే’ పేరుతో చేసిన టోక్యో ఒలింపిక్స్ చీర్ అప్ సాంగ్ సైతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.