ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించింది ‘పుష్ప’. ఇప్పటికే ఈ మూవీ మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. ‘పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘పుష్ప’ ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది.
‘పుష్ప’ చిత్రంలోని పాటలను చంద్రబోస్ అద్భుతంగా రాశారు. ‘దాక్కో దాక్కో మేక’, ‘ఏయ్ బిడ్డా’, ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’ పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డులు అద్భుతం. ‘పుష్ప’ సినిమాలోని ప్రతి విషయం కూడా ప్రేక్షకులకు అడిక్షన్‌లా మారిపోయింది. ప్రతి పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది ‘పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ‘పుష్ప’ అదే కంటిన్యూ చేసింది.
ఈ మధ్యే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కు పంపిన మెసేజ్ వైరల్ అయ్యింది. సుక్కూను పొగుడుతూ.. ‘పుష్ప’ సినిమాను ఆయన వర్ణించిన తీరు సూపర్! ఈ చిత్రంలోని ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.. అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ను ఆకాశానికి ఎత్తేశాడు రాజ్ కుమార్ హిరాణి. ఈ విషయాన్ని కూడా బన్నీ ముందుగానే అంచనా వేశారు. సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు అల్లు అర్జున్. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ‘పుష్ప’ 350 కోట్లు వసూలు చేసిందని ఇవాళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్రం ఏమంటే.. రాజకీయ నాయకులు సైతం ‘పుష్ప’ మేనరిజమ్స్ వాడుకుంటూనే ఉన్నారు!