iBomma Ravi Secrets Out: ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం చేకూర్చిన ఇమంది రవి కస్టడీ సోమవారంతో ముగిసింది. గత 12 రోజులుగా పోలీసులు రవిని ముమ్మరంగా ప్రశ్నించారు. ఈ విచారణలో కేవలం పైరసీ మాత్రమే కాకుండా, రవి ‘ఐడెంటిటీ థెఫ్ట్’ (గుర్తింపు దొంగతనం) కు కూడా పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి.
గతంలో రవి పోలీసులకు చెబుతూ.. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన రూమ్ మేట్ అని, అతని పేరుతోనే లావాదేవీలు జరిగాయని నమ్మబలికాడు. అయితే, పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను రప్పించి రవి ఎదుటే విచారించగా అసలు రంగు బయటపడింది. తనకు రవి ఎవరో తెలియదని, అసలు తామిద్దరం ఎప్పుడూ కలవలేదని ప్రహ్లాద్ తేల్చి చెప్పాడు. సోషల్ మీడియాలో దొరికిన ప్రహ్లాద్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ఉపయోగించి రవి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. తన పేరుతో ఇన్ని అక్రమాలు జరిగాయని తెలుసుకున్న ప్రహ్లాద్ షాక్‌కు గురయ్యాడు.
Pakistan: కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించిన పాకిస్థాన్..
రవి అక్రమ వ్యాపారం ఎంత భారీ స్థాయిలో ఉందో అతని వద్ద దొరికిన డేటా చూస్తే అర్థమవుతుంది. దాదాపు 28,000 పైగా సినిమాలను రవి తనవద్ద స్టోర్ చేసుకున్నాడు. ఇందులో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన పాత, కొత్త సినిమాలు ఉన్నాయి. వీటిని అత్యంత నాణ్యమైన (High Quality) ప్రింట్లుగా మార్చి 10కి పైగా హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచాడు. ఒక సర్వర్ బ్లాక్ అయినా, మరో సర్వర్ ద్వారా వెబ్‌సైట్‌ను నిమిషాల్లో ఆన్‌లైన్‌లోకి తెచ్చేలా అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను కూడా రవి స్వయంగా రూపొందించుకున్నాడు.
కొత్త సినిమాల పైరసీ ప్రింట్లను ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్ల ద్వారా సేకరించి, వాటిని ‘డీఆర్ఎం’ (DRM) సాఫ్ట్‌వేర్ ద్వారా హై-ఎండ్ క్వాలిటీలోకి మార్చేవాడని పోలీసులు తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత రవి మాట్లాడుతూ.. తాను పైరసీ చేయలేదని, కేవలం ఇంటర్నెట్‌లో దొరికిన సినిమాలనే అప్‌లోడ్ చేశానని బుకాయించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా, తాను విదేశీయుడినని (Foreign National), తనపై కేసులు పెట్టడం సరికాదని వాదించాడు.
కస్టడీ ముగియడంతో పోలీసులు రవిని తిరిగి కోర్టులో హాజరుపరిచారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో ప్రహ్లాద్ ఫిర్యాదు మేరకు రవిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
Harish Rao : అసెంబ్లీని 15 రోజులు జరపాల్సిందే.. బీఏసీ మీటింగ్‌లో హరీష్ రావు డిమాండ్..
