NTV Telugu Site icon

Anni Manchi Sakunamule: యాక్షన్ మూవీ చేయాలని ఉంది: మాళవిక నాయర్

Malavika

Malavika

Malavika Nair: స్వప్న సినిమా బ్యానర్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాను మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మూవీ ముచ్చట్లను మాళవిక నాయర్ విలేకరులతో పంచుకున్నారు. ఈ యేడాది ఇప్పటికే మాళవిక నాయర్ నటించిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమా విడుదలైంది. సో యేడాది ఇది ఆమెకు ఇది రెండో సినిమా. ఇందులోని తన పాత్ర గురించి మాళవిక చెబుతూ, “ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కొంచెం సున్నితత్వంతో ఉన్నాయి. కానీ ఇందులో మాత్రం కొంచెం భిన్నంగా వుంటుంది. నా పాత్ర చాలా ఆర్గనైజడ్ గా వుంటుంది. ధైర్యం, కోపం స్పష్టంగా ప్రదర్శించే పాత్ర. అన్నీ తన చేతిలో ఉండాలనుకునే పాత్రలో కనిపిస్తాను. నిజానికి నా తొలి తెలుగు చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లోని ఆనంది పాత్ర మా నిర్మాత ప్రియాంకను పోలి ఉంటుంది. తను హిప్పీ, ఫ్రీ ఫ్లోయింగ్. ఈ సినిమాలోని నా పాత్ర మరో నిర్మాత స్వప్న గారిలా ఉంటుంది. ఆవిడ ఆర్గనైజడ్ లీడర్. కాబట్టి నా పాత్రలో స్వప్నగారిని చూడొచ్చు” అని తెలిపింది.

ఈ సినిమా షూటింగ్ అనుభవాలు వివరిస్తూ, “కూనూర్ హిల్ స్టేషన్ లో చాలా భాగం షూట్ చేశాం. దాదాపు నెల రోజులు అక్కడే వున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారు, నరేష్ గారు, వాసుకి.. ఇలా చాలా మంచి అనుభవజ్ఞులైన నటులతో కలసి నటించడం, వారితో సమయం గడపం చాలా మంచి అనుభూతి. సినిమా గురించే కాకుండా చాలా అంశాలు గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఈ టైటిల్ విషయానికి వస్తే… మలయాళంలో కూడా దాదాపు అలానే పలుకుతారు. నందిని గారు టైటిల్స్ అన్నీ చాలా పాజిటివ్ గా వుంటాయి. ఈ కథని నందిని గారు రెండేళ్ళు క్రితమే చెప్పారు. మంచి మంచి మార్పులతో అద్భుతమైన కథగా రూపొందింది” అని చెప్పింది.

రొటీన్ పాత్రలు తనకు ఇష్టముండదని చెబుతూ, “ఒక నటిగా పాత్ర చేస్తున్నానంటే కొత్తదనం చాలా ముఖ్యం. అది లేకుండా నేను చేయలేను. ప్రతి సినిమా ఒకేలా వుంటే బోర్ కొడుతుంది. అందరూ చేస్తున్నారు కదా.. అందులో నేను చేసేది ఏముంది అనిపిస్తుంది. నేను చేస్తున్నానంటే ఖచ్చితంగా వైవిధ్యం ఉండాలి. ఈ సినిమాలోని పాత్ర విషయంలో నందిని రెడ్డి చాలా ఇన్ పుట్స్ ఇచ్చారు. ఆవిడ ఓ డైరెక్టర్ గా తన విజన్ ని పంచుకుంటారు. అవి అర్ధం చేసుకుని ప్రేక్షకులు నచ్చేలా పాత్రని చేసే బాధ్యత యాక్టర్ పై వుంటుంది. ఇందులో నా పాత్రలో హ్యుమర్ కూడా వుంది. ఇక నా అందం గురించి కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. ఆ విషయంలో మా పేరెంట్స్ చాలా గర్వపడతారు. లుక్ పరంగా నేను పెద్దగా ఏమీ చేయను. డైట్ చూసుకుంటాను. ఈ లుక్ కి కారణం జెనిటిక్స్ అని నమ్ముతాను. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాను” అని తెలిపింది. తనకు బేసికల్ గా యాక్షన్ సినిమాలు ఇష్టమని, అలాంటి చిత్రం కోసం చూస్తున్నానని మాళవిక నాయర్ తెలిపింది. నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీలోనూ మాళవిక ఓ ప్రధాన పాత్రను పోషిస్తోంది.