ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పార్టీ క్యాడర్ ను అలాగే తన అభిమానులనుద్దేసిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్, రాజకీయ ప్రయాణంపై మాట్లాడుతూ.. “నాకు సూపర్ స్టార్ డమ్ ఉంది. ఇండస్ట్రీలో నా రేంజ్ ఏంటో నాకు తెలుసు. నేను అనుకుంటే ఇప్పటికీ OG లాంటి భారీ యాక్షన్ సినిమాలు మరెన్నో చేయగలను, బాక్సాఫీస్ రికార్డులు సృష్టించగలను. కానీ, నాకు గ్లామర్ ప్రపంచం కంటే ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే అత్యంత ఇష్టమైన పని, కేవలం వెండితెరపై హీరోగా కనిపించడం కంటే, నిజ జీవితంలో ప్రజల కష్టాలు తీర్చడమే తనకు తృప్తినిస్తుందని ఆయన చెప్పారు.
అలాగే ‘సినిమా అవార్డుల కంటే ప్రజల మొహాల్లో చూసే నవ్వే తనకు గొప్ప గుర్తింపునిస్తుంది. సినిమాల్లో నటించి ఆస్కార్ అవార్డు సాధించడం నాకు ముఖ్యం కాదు. 70 ఏళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న ఒక మారుమూల గ్రామానికి, మేము అధికారంలోకి వచ్చాక రోడ్డు వేయించగలిగితే, ఆ గ్రామానికి రోడ్డు వచ్చిన రోజు నాకు ఆస్కార్ అవార్డు కొట్టినంత ఆనందం కలుగుతుంది” అని అన్నారు.
