Dhoomam: కెజిఎఫ్ సినిమాతో భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది హోంబలే ఫిల్మ్స్. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ లోనే సలార్ సినిమా వస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకొంటుంది. ఇక ఈ సినిమా తరువాత హోంబలే ఫిల్మ్స్ తన తదుపరి సినిమాను ప్రకటించింది. మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్ హీరోగా పవన్ కుమార్ దర్శకత్వంలో ధూమం అనే సినిమాను నిర్మిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ కుమార్ ఇటీవలే కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన గాలిపట 2 కు దర్శకత్వం వహించాడు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫాహద్ సరసన ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాల మురళీ నటిస్తోంది. పుష్ప సినిమాతో ఫాహద్ పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయ్యాడు. దీంతో అతని సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా తెలుగులో ధూమం పేరుతోనే రిలీజ్ కానుంది. ఇక ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నదట. అక్టోబర్ 9 న ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ధూమం రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో కెజిఎఫ్ రికార్డును హోంబలే బద్దలు కొడుతుందా..? లేదా..? అనేది చూడాలి. ఇక ఈ సినిమాను పక్కన పెడితే ప్రస్తుతం ఫాహద్ పుష్ప 2, టాప్ గేర్ సినిమాల్లో నటిస్తున్నాడు.