కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాతో ఢీ కొంటున్నాడు. టైగర్ ష్రాఫ్ తాజా చిత్రం ‘హీరో పంతి-2’ ఏప్రిల్ 29న జనం ముందు వాలనుంది. అదే రోజున అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి టాప్ స్టార్స్ నటించిన ‘రన్ వే 34’ విడుదల కానుంది. మరి అంత పెద్ద స్టార్స్ సినిమాతో పోటీ అంటే మాటలా!? అందుకే తన సినిమాకు, తనకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గా సందర్శించనున్నాడు టైగర్ ష్రాఫ్. తన ప్రతి సినిమా విడుదల సమయంలో ఏదో ఒక పవిత్ర క్షేత్రం వెళ్ళి ప్రార్థించి రావడం టైగర్ అలవాటు. అందునా ‘హీరో పంతి-2’ అతనికి మరింత ప్రత్యేకం! ఎందుకంటే ఎనిమిదేళ్ళ క్రితం ‘హీరో పంతి’ సినిమాతోనే టైగర్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా సీక్వెల్ కాబట్టి, ఈ సినిమా టైగర్ కు స్పెషల్ కాక ఏమవుతుంది?
టైగర్ కు ‘హీరో పంతి-2’ మరో రకంగానూ ప్రత్యేకమైనదే. అతను హీరోగా నటించిన ‘బాఘీ-3’ 2020 మార్చి 6న ప్రేక్షకులను పలకరించింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా టైగర్ నటించిన ఏ చిత్రమూ విడుదల కాలేదు. రెండేళ్ళ తరువాత విడుదలవుతున్న చిత్రం, అందునా టాప్ స్టార్స్ సినిమాతో ఢీ కొంటున్న తరుణం కాబట్టి టైగర్ కు ‘హీరో పంతి-2’ ఉత్కంఠ కలిగిస్తోంది. ఎనిమిదేళ్ళ పాటు తాను హీరోగా కొనసాగడానికి కారణమైన తొలి చిత్రం ‘హీరోపంతి’ని తాను మరచిపోలేనని, అలాగే ఆ సినిమా సీక్వెల్ సైతం తనకెంతో ప్రత్యేకం అంటున్నాడు టైగర్. మరి ‘హీరో పంతి-2’ టైగర్ కు ఏ స్థాయిలో సంతృప్తి కలిగిస్తుందో చూడాలి.
