కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి ప్రేమలో పడ్డాడు.. కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్.. తన పెళ్లికి, నడిగర్ సంఘం కొత్త భవనానికి లింకు పెట్టిన విషయం విదితమే. గత కొన్నేళ్ల క్రితం నుంచి విశాల్.. నడిగర్ సంఘం కోసం కొత్త భవనం నిర్మించిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు. ఇక కెరీర్ మొదట్లో విశాల్, హీరోయిన్ వరలక్ష్మీ తో ప్రేమలో ఉన్నాడని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని వరలక్ష్మీ క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు చెక్ పడింది.. ఇక 2019 లో హైదరాబాద్ అమ్మాయి అనీషా అల్లా తో విశాల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది.
ఇక ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతారు అనుకునేలోపు ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు విశాల్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి సింగిల్ గా ఉంటున్న విశాల్.. కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం లాఠీ అనే సినిమాలో నటిస్తున్న విశాల్.. మరోసారి ప్రేమలో ఉన్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్.. పెళ్లి, ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి..? అన్న ప్రశ్నకు సమాధానంగా “త్వరలోనే పెళ్లి చేసుకుంటాను.. ఈసారి ఇంట్లో చూసినవారిని చేసుకోవాలనుకోవడంలేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి వివరాలు ఏమి చెప్పకపోవడంతో ఎవరా అమ్మాయి..? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి ఈసారైనా విశాల్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడతాడా..? నడిగర్ సంఘానికి కొత్త భవనం నిర్మిస్తాడా..? అనేది చూడాలి.