రిస్క్ చేసే అతికొద్దిమంది హీరోల్లో విశాల్ ఒకడు. డూప్ లేకుండా పోరాట సన్నివేశాలు చేస్తాడు. డూప్ ఉంటే సహజత్వం లోపిస్తుందని, అభిమానులు కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేరన్న భావనతో.. యాక్షన్ సీన్స్ కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలైన సందర్భాలూ ఉన్నాయి. అయినా కాంప్రమైజ్ అవ్వకుండా, రిస్క్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇతడు మరోసారి గాయాలపాలయ్యాడు.
విశాల్ ప్రస్తుతం వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమా చేస్తున్నాడు. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తుండగా.. ఓ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విశాల్ కాలికి గాయమైంది. మునుపటితో పోలిస్తే.. ఈసారి గాయాలు తీవ్రంగా ఉన్నట్టు తెలిసింది. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తద్వారా షూటింగ్ ఆగింది. ఈ సినిమా షూట్‌లో విశాల్ ఇలా గాయాలపాలవ్వడం ఇది రెండోసారి. ఇదివరకే హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు.. విశాల్ చేతికి, వేళ్లకు గాయాలయ్యాయి. అప్పుడు వెంటనే షూట్ ఆపేసి, కేరళలో చికిత్స తీసుకున్నాడు. ఆ గాయాల నుంచి కోలుకున్నాక తిరిగి షూట్‌లో పాల్గొన్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా.. ఈ సినిమాలో విశాల్ సరసన సునైన హీరోయిన్‌గా నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని రానా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలసుబ్రమణ్యం, ఎన్బీ శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. కొంతకాలం నుంచి సరైన హిట్ లేకపోవడంతో.. విశాల్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే, ఇంతలా కష్టపడుతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
