నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. తాజాగా ‘గాడ్సే’తో జనం ముందుకు వచ్చిన సత్యదేవ్ వైవిధ్యం కోసం తపిస్తూ ఉంటాడని ఇట్టే తెలిసిపోతుంది.
సత్యదేవ్ కంచరణ 1989 జూలై 4న వైజాగ్‌లో జన్మించారు. విశాఖపట్నంలోనే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న సత్యదేవ్ విజయనగరంలోని ‘ఎమ్.వి.జి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. 2016 దాకా ఐబీయమ్, వియమ్ వేర్ సంస్థల్లో పనిచేసిన సత్యదేవ్ తరువాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. కొన్ని లఘు చిత్రాల్లో నటించాడు. ఆ పై ప్రభాస్ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’లో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద” చిత్రాలలోనూ నటించాడు సత్యదేవ్. కానీ, అతనికి మంచి గుర్తింపు సంపాదించిపెట్టిన చిత్రం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ అనే చెప్పాలి. ఇతరుల చిత్రాలలో నటిస్తూన్న సత్యదేవ్ కు ‘అంతరిక్షం 9000 కెఎమ్.పిహెచ్.’ మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇందులో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు సత్యదేవ్.
మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’లో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించినా, మంచి గుర్తింపు లభించింది. సత్యదేవ్ హీరోగా రూపొందిన “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘గువ్వాగోరింక’, ‘తిమ్మరుసు’ చిత్రాలు అలరించాయి. తాజాగా విడుదలైన ‘గాడ్సే’ మునుపటిలా ఆకట్టుకోలేక పోయిందనే చెప్పాలి. ‘ఆచార్య’లో కాసేపు కనిపించిన సత్యదేవ్, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ కీలక పాత్ర పో షిస్తున్నాడు. “గుర్తుందా శీతాకాలం, రామ్ సేతు, ఫుల్ బాటిల్” అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. రాబోయే సినిమాలతోనూ వైవిధ్యంగా కనిపించి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న సత్యదేవ్ సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.
(జూలై 4న సత్యదేవ్ పుట్టినరోజు)