Site icon NTV Telugu

Aha Naa Pellanta: పెళ్ళి పీటల మీద నుండి వెళ్ళిపోయిన శివానీ రాజశేఖర్!

Raj Tarun

Raj Tarun

తెలుగులో సీనియర్ హీరోలే కాదు యువ కథానాయకులు కూడా ఇప్పుడు వెబ్ సీరిస్ లో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే సుశాంత్ ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సైతం వెబ్ సీరిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జీ 5 ఒరిజినల్ వెబ్ సీరీస్ ‘అహ నా పెళ్ళంట’లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ నటిస్తోంది. గతంలో ‘ఏబీసీడీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సంజీవ్ రెడ్డి ఈ వెబ్ సీరిస్ కు దర్శకుడు. రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలోని జరిగిన ఈ వెబ్ సీరిస్ ప్రారంభోత్సవానికి ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, చందన నాగేశ్వరావ్‌, కందుల దుర్గేష్‌, ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్‌, జీ5కు చెందిన పూర్ణ ప్రజ్ఞ, రాధ కృష్ణవేణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వెబ్ సీరిస్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్‌ జరుపుతాం. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ ఇది. అందరినీ అలరించేలా ఉంటుంది. కామెడీ డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ 30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ గా ప్రసారం అవుతుంది” అని అన్నారు.

దర్శకుడు సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ, ”పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి… తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని అస్సలు ఊహించడు. ఆ పెళ్లి కొడుకు, అందుకు కారణమైన అమ్మాయి – అబ్బాయి పై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు? ఆ తర్వాత ఏమైంది? అనేదే కథ” అని చెప్పారు. ఇందులో ఆమని, హర్షవర్ధన్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version