ప్రియాంక టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘హసీన’. సాయితేజ గంజి, ధన్వీర్, శివగంగ, ఆకాశ్ లాల్, వశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ఠ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నవీన్ ఇరగాని దర్శకత్వంలో ఎస్. రాజశేఖర్ రెడ్డి, ఎండీ తన్వీర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ టెక్నికల్ క్రైమ్ థిల్లర్ మూవీలోని హ్యాపీ బర్త్ డే సాంగ్ ను ప్రముఖ ర్యాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. షారుక్ షేక్ దీనికి ట్యూన్స్ ఇవ్వగా, ప్రసాద్ నల్ల సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ యూత్ ఫుల్ బర్త్ డే పార్టీ సాంగ్ ను ప్రముఖ కథానాయకుడు నిఖిల్ ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ, ”ఈ పాటను చూస్తుంటే కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి. సాంగ్ రిలీజ్ చేసినందుకు ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా సినిమా చూస్తాను. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సాయి తేజకు శుభాకాంక్షలు” అని అన్నారు. డైరెక్టర్ నవీన్ ఇరగాని మాట్లాడుతూ, ”మా సినిమా పాటను హీరో నిఖిల్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా లాంటి కొత్తవాళ్లకు నాని, నిఖిల్, రవితేజ గార్లు ఇన్‌స్పిరేషన్” అని అన్నారు. హీరో సాయితేజ మాట్లాడుతూ, ‘తాను హీరో నిఖిల్ కు పెద్ద అభిమానినని, తన పుట్టిన రోజున ఈ పాటను ఆయన విడుదల చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించింద’ని చెప్పారు. ఈ సినిమాకు నవనీత్ చారి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.