Mouli: యూట్యూబ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న కంటెంట్ క్రియేటర్ మౌళి.. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘దొంగనా కొడుకు’ సినిమా నుంచి విడుదలైన ‘ఓ మై గాడ్’ పాట లాంచ్ ఈవెంట్లో హీరో మౌళి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నప్పుడు నలుగురి ముందు మాట్లాడటానికే భయపడి కన్నీళ్లు పెట్టుకున్న ఒక సాధారణ కుర్రాడు.. నేడు టాలీవుడ్‌లోని టాప్ బ్యానర్లో హీరోగా సినిమా చేసే స్థాయికి ఎలా చేరుకున్నాడో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఈవెంట్లో మౌళి మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. “నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు క్లాస్‌లో చిన్న కాంపిటీషన్ జరిగింది. బోర్డు దగ్గరికి వచ్చి ఏదైనా జోక్ చెప్పాలని నన్ను పిలిచారు. ఉల్లిపాయ జోక్ ఒకటి ప్రిపేర్ చేసుకుని స్టేజ్ దగ్గరికి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లేసరికి కాళ్లు గడగడా వణికాయి, నోట్లోంచి మాట రాలేదు. క్లాస్‌లో అందరి ముందే భయంతో ఏడ్చేశాను. పిల్లలంతా ఎగతాళి చేసి నవ్వారు. అలాంటి నేను.. ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్డులో వందలాది మంది చూస్తుండగా ఎలాంటి టెన్షన్ లేకుండా డ్యాన్స్ చేశానంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. నిన్న రాత్రి ఆలోచిస్తే ఆ మౌళి ఎక్కడ.. ఈ మౌళి ఎక్కడ అనిపించింది” అంటూ చెప్పుకొచ్చాడు.
తన జీవితంలో ఈ మార్పు రావడానికి కారణం ఒక్కటేనని మౌళి వివరించాడు. భయాన్ని పక్కనపెట్టి ప్రతీసారి తన ‘కంఫర్ట్ జోన్’ నుంచి బయటకు రావడమే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని చెప్పాడు. “ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి స్టేజ్‌పైకి ఎక్కి సంబంధం లేని టాపిక్స్ మాట్లాడేవాడిని. కాలేజీలో ఇంజినీరింగ్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు మొదలుపెట్టా. యూట్యూబ్ హిట్ అవ్వగానే వైజాగ్‌లోనే ఉండిపోవచ్చు అన్నారు.. కానీ నేను యాక్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చా. ఇక్కడ చిన్న పాత్రలు వస్తున్నప్పుడు లీడ్ రోల్ చేయాలని కష్టపడ్డాను. ‘లిటిల్ హార్ట్స్’ హిట్ అయ్యాక కూడా ఆగకుండా మైత్రీ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటూ హీరోగా చేస్తూ రిస్క్ తీసుకున్నాను. కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతే మనం ఎప్పటికీ ఏమీ సాధించలేం” అని స్పష్టం చేశాడు.
ఈ సినిమాలో తనతో అంతగా డ్యాన్స్ చేయించినందుకు కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. “లైఫ్‌లో నేను ఇంత డ్యాన్స్ చేస్తానని అస్సలు అనుకోలేదు. సినిమాలో నా డ్యాన్స్ చూసి మా మమ్మీ కూడా షాక్ అయింది. కేవలం మాంటేజెస్ తీద్దామని అడిగినా సందీప్ మాస్టర్ నన్ను పుష్ చేసి మరిన్ని స్టెప్పులు వేయించారు” అని నవ్వుతూ చెప్పాడు. అలాగే అద్భుతమైన లిరిక్స్ అందించిన భాస్కర్ బట్ల, ట్యూన్ కంపోజ్ చేసిన సింజిత్, పాడిన సింగర్ రామ్ మిర్యాలకు థాంక్స్ చెప్పాడు. ‘దొంగనా కొడుకు’ సినిమా ఆద్యంతం హిలేరియస్‌గా ఉంటుందని, థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకుంటారని మౌళి ధీమా వ్యక్తం చేశాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని, నవంబర్ 13న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించాలని కోరాడు.

