అఫ్గనిస్తాన్ సంపూర్ణంగా తాలిబన్ల వశమైంది. మరోసారి ప్రజలు స్వంత దేశంలో బందీలైపోయారు. ఆడవారు, పిల్లల పరిస్థితి అయితే మరింత దారుణం. బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి. కానీ, అఫ్గాన్ ఎప్పుడూ ఇలాగే ఉండేదా? కాదంటోంది సీనియర్ నటి హేమా మాలిని.
కొన్ని దశాబ్దాల క్రితం ‘ధర్మాత్మా’ అనే సినిమా విడుదలైంది. అందులో ధర్మేంద్ర, హేమా మాలిని జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ ఓ గ్యాంగ్ స్టర్ గా, విలన్ గా నటించాడు. ఆ సినిమాలో హేమా మాలిని పాత్ర ఎక్కడా స్థిరంగా ఉండక ఊరూరూ తిరుగుతుంటుంది. అటువంటి అమ్మాయి జీవితం చూపించటానికి అప్పట్లో అఫ్గనిస్తాన్ ను ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. చాలా రోజులు హేమా మాలిని, ధర్మేంద్ర, ఫిరోజ్ ఖాన్ కాబూల్ లో బస చేశారట!
అఫ్గనిస్తాన్ లోని తాజా విషాదకర పరిణామాల నేపథ్యంలో హేమా అలనాటి జ్ఞాపకాల్ని గుర్తుకు చేసుకుంది. ‘ధర్మాత్మా’ సినిమా షూటింగ్ కోసం తల్లిదండ్రులతో కలసి తాను అఫ్గనిస్తాన్ వెళ్లానని ఆమె చెప్పింది. అప్పట్లో అదొక ఆనందకరమైన శాంతియుత దేశమని ఆమె పేర్కొంది. కానీ, ఇప్పుడు తాలిబన్ల వశం కావటం బాధ కలిగిస్తోందని అన్న హేమా ‘ధర్మాత్మా’ సినిమా పోస్టర్స్ కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది…
హేమా మాలిని లాగే బీ-టౌన్ సెలబ్రిటీస్ మరికొందరు అఫ్గాన్ వ్యవహారాలపై విచారం వ్యక్తం చేశారు. అనుష్కా శర్మ, రియా చక్రవర్తి విభ్రాంతిని తెలియజేశారు. “బతకటం చావటం కంటే దారుణమైనప్పుడు…” అంటూ కంగనా ట్వీట్ చేసింది. ఆమె కాబూల్ లో కదులుతోన్న విమానం వెంట రన్ వే పై జనం పరిగెత్తే వీడియోను ఉద్దేశించి ఈ కామెంట్ చేసింది!
