NTV Telugu Site icon

RamCharan: రామ్‌చరణ్ ఇంటికి వెళ్లిన టీమిండియా స్టార్ క్రికెటర్లు

Hardik Pandya

Hardik Pandya

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్‌చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా హైదరాబాద్ క్రికెట్‌ అభిమానుల కోసం అన్నట్లుగా టీమిండియా క్రికెటర్స్ ఆదివారం అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి సూపర్ విక్టరీని దక్కించుకున్నారు. తద్వారా ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సిరీస్ కూడా కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్ హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగ అన్నట్లుగా సాగింది. అటు హీరో రామ్‌చరణ్ క్రేజ్ ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రామ్‌చరణ్ ఎందరో అభిమానుల గుండెలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో హీరో రామ్‌చరణ్ ఆహ్వానించగానే టీమిండియా క్రికెటర్లు అతడి ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు టీమిండియా క్రికెటర్లు రామ్‌చరణ్‌ను కలిసిన ఫోటోల కోసం మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అతి త్వరలోనే ఆ ఫోటోలు బయటకు వస్తాయని మెగా కాంపౌండ్ వర్గాలు వెల్లడించాయి.