NTV Telugu Site icon

మధురం పంచేది ‘మనో’డే!

Mano

ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగే పాడుతూ, జనాన్ని ఆకట్టుకున్నారు మనో. ఒకానొక సమయంలో ఏది బాలు పాడిందో, ఏ పాట మనో నోట పలికిందో అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. బాలు బాటలోనే పయనిస్తూ రేయింబవళ్ళు పాడుతూనే ఇప్పటికి యాభై వేల పైచిలుకు పాటలు పాడి అలరించారు మనో. దాదాపు 15 భాషల్లో మనో పాట మధురం పంచింది. తెలుగునాట పుట్టి అందరి మన్ననలు అందుకుంటున్న మనో ‘మనోడే’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కొన్ని చిత్రాలలో నటనతోనూ అలరించిన మనో, ప్రస్తుతం బుల్లితెరపై పలు విన్యాసాలు చేస్తున్నారు.

మనో అసలు పేరు నాగూర్ బాబు. 1965 అక్టోబర్ 26న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మనో జన్మించారు. మనో తండ్రి రసూల్ ఆల్ ఇండియా రేడియోలో సంగీతం సమకూర్చేవారు. మనో తల్లి షహీదా రంగస్థల నటి. తల్లితో పాటే మనో కూడా అనేక నాటకాల్లో నటించాడు. తన పాటలు తానే పాడుకుంటూ మనో నటించి ఆకట్టుకొనేవారు. నేదునూరి కృష్ణమూర్తి వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు మనో. ఓ వైపు సంగీతసాధన చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘రంగూన్ రౌడీ’, ‘ఓ ఆడది – ఓ మగాడు’, ‘కేటుగాడు’ వంటి చిత్రాలలో మనో నటించారు. ఆరంభంలో కోరస్ లో పాడేవారు మనో. తరువాత బాలు, చక్రవర్తి, ఇళయరాజా ప్రోత్సాహంతో మనో పాట సైతం జనాన్ని చేరుకుంది. కొంతమంది పరభాషా నటులకు డబ్బింగ్ కూడా చెప్పేవారు, బాలునే తన గురువుగా భావించి, మనో ఆయనతోనే కలసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బాలు సైతం సొంత తమ్మునిలా మనోను ప్రోత్సహించారు. తెలుగునాట అగ్రకథానాయకుల అందరికీ పాటలు పాడి ఆకట్టుకున్నారు మనో.

రజనీకాంత్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు మనో. అంతకు ముందు రజనీకాంత్ కు సాయికుమార్ వంటి పలువురు నేపథ్యగాత్రం అందించారు. ‘ముత్తు’ సినిమా నుండి “అరుణాచలం, నరసింహ, శివాజీ, రోబో, కబాలీ, కాలా, పేట్ట, దర్బార్” వంటి చిత్రాలలో రజనీ అభినయానికి, మనో గాత్రానికీ జోడీ కుదిరి అలరించాయి.

కమల్ హాసన్ కు ‘సతీ లీలావతి, బ్రహ్మచారి’ చిత్రాలలో డబ్బింగ్ చెప్పారు. ఇప్పటికీ బాలునే ఆ చిత్రాలలో కమల్ కు డబ్బింగ్ చెప్పారని చాలామంది భావిస్తూ ఉంటారు. రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’ తెలుగు అనువాదం ‘పెద్దన్న’లోనూ రజనీకి మనో గాత్రమే తెలుగు మాటలు పలికింది. ఈ చిత్రం నవంబర్ 4న జనం ముందు నిలవనుంది.

బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. ‘జబర్దస్త్’ షోలో భలేగా నవ్వులు పూయిస్తున్నారు. ఈ మధ్యే వచ్చిన ‘క్రేజీ అంకుల్స్’లోనూ నటించారు. ఏది ఏమైనా మనో గానం ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉంది. ఆయన మరిన్ని పాటలతో అలరిస్తారని ఆశిద్దాం.