Site icon NTV Telugu

HBD Anantha Sriram : పసందైన పదబంధాలతో అనంత్ పయనం!

Anantha Sriram

Anantha Sriram

(ఏప్రిల్ 8న గీత రచయిత అనంత్ శ్రీరామ్ జన్మదినం)
మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఎలా ఉండబోతోందో కానీ, అందులోని “కళావతి…” పాట మాత్రం జనం మదిని గిల్లేస్తోంది. అందులోని “వందో… ఒక వెయ్యో… ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ చిత్రవిచిత్రంగా పాటను ప్రారంభించడంలోనే ఓ వైవిధ్యం కనిపిస్తోంది. ఆ విధంగా పద రచన చేసిన ఘనుడు అనంత్ శ్రీరామ్. ప్రస్తుతం అనంత్ శ్రీరామ్ పదబంధాలతో పలు పాటలు అనేక చిత్రాలలో చోటు చేసుకొని జనాన్ని పరవశింప చేస్తున్నాయి. ‘బాహుబలి’ మొదటి భాగంలో ‘పచ్చబొట్టు…’ పాటతో జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదించాడు అనంత్ శ్రీరామ్. ఇప్పటికీ ప్రేక్షకులను అలరించే చిత్ర విచిత్ర ప్రయోగాల కోసం అనంత్ శ్రీరామ్ మది తపిస్తూనే ఉంది. తొలి చిత్రం ‘కాదంటే అవుననిలే’ టైటిల్ లోనే పింగళి వారి పదవిన్యాసం కనిపించడంతో అనంత్ కూడా హుషారుగా కలాన్ని పరుగులు తీయించాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా దాదాపు వేయి పాటలు అనంత్ శ్రీరామ్ కలం నుండి జాలువారి జనాన్ని మెప్పించాయి.

చేగొండి అనంత్ శ్రీరామ్ 1984 ఏప్రిల్ 8న జన్మించాడు. శ్రీరామ్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డపట్ల. ఆయన కన్నవారు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. అనంత్ శ్రీరామ్ తండ్రి సత్యనారాయణకు మాజీ మంత్రి, చిత్ర నిర్మాత చేగొండి హరిరామజోగయ్య సమీపబంధువు. ఆయన ప్రోత్సాహంతోనే అనంత్ శ్రీరామ్ చిత్రసీమలో అడుగు పెట్టాడు.

ఊహలకు ఊపిరి వస్తే, వాస్తవాలు వెల్లివిరుస్తాయి అన్నారు విజ్ఞులు. అనంత్ శ్రీరామ్ పదబంధాలు సైతం అదే తీరున సాగాయి. అనుభవం లేని సందర్భాల్లోనూ ఊహాజనితమైన పదాలతో పరుగులు తీశాడు. అవే అనంత్ శ్రీరామ్ ను ప్రత్యేకంగా నిలిపాయి. అనంత్ లోని సాహిత్యశోభను చూసి కీరవాణికి ముచ్చటేసింది. తాను స్వరకల్పన చేసే చిత్రాలలో అనంత్ ను ప్రోత్సహించారాయన. మరికొందరు సంగీత దర్శకులు, యువదర్శకులు కూడా తమ చిత్రాల్లోని సందర్భాలు వివరించగానే అనంత్ నోట పలికిన మాటలు విని ఆశ్చర్య పోయి, ఆ మాటలతోనే పాటలు రాయించుకున్నారు. తన దరికి చేరిన ఏ సినిమాకైనా న్యాయం చేయాలని తపించేవాడు అనంత్ శ్రీరామ్. ఈ తపనలో అనేక చిత్రాలలో సింగిల్ కార్డ్ కూడా వేయించుకున్నాడు. ‘ఎటో వెళ్ళి పోయింది మనసు’తో ఉత్తమ గీతరచయితగా నంది అవార్డును, ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు అనంత్. ఇతనిలోని సాహిత్యాభిలాషను గమనించిన ఎందరో అనంత్ కు మిత్రులుగా మారారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ రాసిన ‘ఎ లవ్, అన్ కండిషనల్’ రూపకల్పనలో అనంత్ శ్రీరామ్ పాత్ర కూడా ఉంది. ఇలా ఓ వైపు పాటలు రాస్తూనే, మరోవైపు తన దరికి చేరిన సాహితీగంధానికి తన పదాలతో మరింత సువాసన పెంచే ప్రయత్నం చేస్తుంటాడు అనంత్ శ్రీరామ్.

కేవలం పాటలు రాయడంలోనే కాదు కొన్ని చిత్రాలలో అనంత్ నటించాడు కూడా. ఏది ఏమైనా, అనంత్ శ్రీరామ్ పాటలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. మరిన్ని మంచి పాటలతో అనంత్ జనాన్ని మరింతగా ఆకట్టు కుంటారని ఆశిద్దాం.

Exit mobile version