Site icon NTV Telugu

HBD Suma Kanakala : మాటలతో మాయ చేసే సుమ!

Suma

(మార్చి 22న సుమ కనకాల పుట్టినరోజు)
కోటలు దాటే మాటలు అంటారు కానీ, మాటలతో కోటలు కట్టిన మేటి మాటకారి సుమ కనకాల. తెలుగునాట వ్యాఖ్యాతలు సైతం సెలబ్రిటీ స్టేటస్ చవిచూస్తారని నిరూపించిన ఘనత సుమ సొంతం. నటి కావాలని పాతికేళ్ళ క్రితం బయలు దేరిన సుమ, వెండితెరపై అంతగా వెలగలేదు. కానీ, వందలాది చిత్రాలు వెండితరపై వెలగబోయేముందు జరిగే ఉత్సవాలలో మాత్రం సుమ గాత్రం విజయనాదం చేస్తూనే ఉంది. ఆమె వ్యాఖ్యానంతో సాగిన సినిమా ఉత్సవాలు, విజయోత్సవాలు అన్నీ జనం మదిని దోచాయి. ఇక బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సాగుతున్న అనేక కార్యక్రమాలు జనాన్ని విశేషంగా అలరిస్తున్నాయి. సుమకు ముందు కూడా పలువురు యాంకరింగ్ లో మేటి అనిపించుకున్నా, సుమ తరువాతనే ఎవరైనా అనిపించేలా ఆమె బాణీ పలికించారు. ఇక సుమను స్ఫూర్తిగా తీసుకొని తమ మాటలతో విజయానికి బాటలు వేసుకోవాలని ఎందరో మగువలు బయలు దేరారు. వారిలో కొందరు విజయం సాధించారు.

పాచవిటల్ సుమ 1974 మార్చి 22న కేరళలో జన్మించారు. సుమ తెలుగునాట పుట్టకపోయినా, తెలుగుభాషపై ఆమె పట్టును చూస్తే ముక్కున వేలేసుకోక మానరు. ఎంతోమంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చిన లక్ష్మి, దేవదాసు కనకాల వద్ద సుమ కూడా శిక్షణ తీసుకున్నారు. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో తొలిసారి సుమ వెండితెరపై నాయికగా కనిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లోనూ ఆమె నటించారు. ఎందువల్లో సుమ సినిమాల్లో అంతగా అలరించలేకపోయారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో సుమ భలేగా మురిపించారు. లక్ష్మి, దేవదాస్ కనకాల దంపతుల తనయుడు రాజీవ్ ను ప్రేమించి పెళ్ళాడారు సుమ. సినిమాల్లో రాజీవ్ రాణిస్తూండగా, సుమ తనదైన పంథాలో వ్యాఖ్యాతగా సాగుతున్నారు. ఈటీవీ ‘స్టార్ మహిళ’ కార్యక్రమంతో సుమ స్టార్ యాంకర్ గా జేజేలు అందుకున్నారు. ఇప్పటికీ స్టార్ యాంకర్ అంటే సుమ పేరే ముందుగా వినిపిస్తుంది. తన వ్యాఖ్యానంలో సుమ ఆశువుగా వల్లించే పదాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అందువల్లే సినీజనం తమ ఉత్సవాలకు సుమ యాంకర్ గా వ్యవహరించాలని ఆశిస్తూ ఉంటారు.

సుమ, రాజీవ్ దంపతుల తనయుడు రోహన్ కూడా తాత,తండ్రి, తల్లి బాటలో నటనలో రాణించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రోహన్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. తప్పకుండా రోహన్ ‘కనకాల నటకుటుంబం మూడో తరం’ పేరు నిలుపుతాడని తల్లి సుమ, తండ్రి రాజీవ్ ఆశిస్తున్నారు. సుమ మనసు మళ్ళీ నటనపైకి మళ్ళినట్టుంది. ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమాలో సుమ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘ఓ బేబీ’లో ఆమె టీవీ యాంకర్ గానే దర్శనమిచ్చారు. మరి రాబోయే ‘జయమ్మ పంచాయితీ’లో సుమ మాటల కోటలు ఏ తీరున అలరిస్తాయో చూడాలి.

Exit mobile version