(ఏప్రిల్ 17న హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు)
కొన్ని ముఖాలు చూడగానే, పాపం పిల్లాడు అనిపిస్తాయి. అలా వయసుతో నిమిత్తం లేకుండా చాలా రోజులు పిల్లాడిలాగే కనిపించి మాయ చేశారు నవతరం కథానాయకుడు సిద్ధార్థ్. చదువు పూర్తి కాగానే సినిమాలపై ఆసక్తితో పరుగు తీసిన సిద్ధార్థ్ కు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ద్వారా మణిరత్నం వంటి దిగ్దర్శకుని వద్ద అసోసియేట్ గా పనిచేసే అవకాశం లభించింది. మణిరత్నం తెరకెక్కించిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’కు అలా అసోసియేట్ గా చేశారు సిద్ధార్థ్. అదే చిత్రం తెలుగులో ‘అమృత’ పేరుతో అనువాదమయింది. ఆ మూవీలో ఓ సీన్ లో తళుక్కున మెరిసిన సిద్ధార్థ్ లోని నటుణ్ణి గుర్తించింది రచయిత సుజాత. ఆయన ప్రోత్సాహంతోనే శంకర్ తన ‘బోయ్స్’ లో సిద్ధార్థ్ ను హీరోగా ఎంచుకున్నారు. ఆ చిత్రం తరువాత నటనపైకి ధ్యాస మళ్ళించారు సిద్ధార్థ్. మణిరత్నం రూపొందించిన ‘యువ’లోనూ కీలక పాత్ర ధరించిన సిద్ధార్థ్ ను తెలుగు నిర్మాత ఎమ్మెస్ రాజు తన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగువారికి పరిచయం చేశారు. ఈ చిత్రంతోనే నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకునిగా మారారు. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో సిద్ధార్థ్ కు తెలుగునాట విశేషాదరణ లభించింది.
సిద్ధార్థ్ 1979 ఏప్రిల్ 17న మద్రాసులో జన్మించారు. హైస్కూల్ చదివే రోజుల్లో అందరినీ ఆకర్షించేలా మాట్లాడేవారు సిద్ధార్థ్. తరువాత కాలేజ్ లో చేరగానే మెల్లగా థియేటర్ పై ఆసక్తి పెంచుకున్నారు. ఎమ్.బి.ఏ. చదివే రోజుల్లో అయితే తన గాత్రంతో అందరినీ సమ్మోహితులను చేశారు. ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన సిద్ధార్థ్ చిత్రసీమలో అడుగు పెట్టారు. ఆయనలోని ప్రతిభకు సినిమారంగం గొడుగు పట్టింది. తెలుగు, తమిళ చిత్రాలలోనే కాదు హిందీలోనూ సిద్ధార్థ్ తనదైన బాణీ పలికించారు.
సిద్ధార్థ్ లోని నటుడు, ప్రముఖ హిందీ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రాకు కూడా భలేగా నచ్చాడు. దాంతో తాను తెరకెక్కించిన ‘రంగ్ దే బసంతీ’లో కీలకమైన భగత్ సింగ్ పాత్రను ఇచ్చారు. అందులో హీరోగా నటించిన ఆమిర్ ఖాన్ సైతం సిద్ధార్థ్ ను ఎంతగానో ప్రోత్సహించారు. తెలుగు చిత్రాల ఆదరణతో సిద్ధార్థ్ దృష్టి ఇక్కడే కేంద్రీకరించారు. “చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఓ ధీరుడు, బావ, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్” వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ ‘బాద్ షా’లో యన్టీఆర్ ఫ్రెండ్ గా కనిపించారు. నటునిగా, గాయకునిగా, నిర్మాతగా, రచయితగా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగులో ఆదరణ తగ్గిపోగానే, తమిళ బాట పట్టారు సిద్ధార్థ్. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయారు. గత సంవత్సరం’మహాసముద్రం’ అనే ద్విభాషా చిత్రం ద్వారా మళ్ళీ తెలుగువారిని అలరించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ కూడా నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా అలరించలేదు. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు సిద్ధార్థ్. ఆ సినిమాలలో కొన్ని తెలుగులోనూ అనువాదమవుతాయని తెలుస్తోంది. మరి ఈ సారి సిద్ధార్థ్ ప్రేక్షకులను ఎలా రంజింప చేస్తారో చూడాలి.