(మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు)
ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెదుక్కోవాలని సామెత! యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాపై మనసు పారేసుకున్నాడు. దాంతో చిత్రసీమలోనే పారేసుకున్న మనసును సంతృప్తి పరచడానికి పరితపించాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు శర్వానంద్.
శర్వానంద్ మైనేని 1984 మార్చి 6న విజయవాడలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత సికిందరాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ లో బి.కామ్, పూర్తి చేశాడు శర్వానంద్. కాలేజ్ లో అడుగుపెట్టిన టీనేజ్ లోనే శర్వానంద్ తనకు చదువు అంతగా వంటపట్టదని గ్రహించేశాడు. దాంతో 17 ఏళ్ళకే ముంబయ్ వెళ్ళి కిశోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తరువాత ఎలాగోలా బి.కామ్, పూర్తి చేశాడు. చిరంజీవి థమ్స్ అప్ యాడ్ లో కనిపించాడు. ‘5వ తారీఖు’ సినిమాలో తొలిసారి నటించాడు. తరువాత వచ్చిన ‘యువసేన’తో మంచి గుర్తింపు సంపాదించాడు. చిరంజీవి ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.’లో ఓ చిన్న పాత్రలో నటించినా, అది కూడా శర్వానంద్ కు గుర్తింపును సంపాదించి పెట్టింది. తరువాత పలు చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు హీరోగానూ అభినయించాడు. ఆ ప్రయాణంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘గమ్యం’ శర్వానంద్ కు హీరోగా మంచి విజయాన్ని అందించింది.
‘గమ్యం’తో హీరోగా మంచి విజయం సాధించిన దగ్గర నుంచీ శర్వానంద్ ఆచితూచి అడుగేస్తూ, మంచి కథలను ఎంపిక చేసుకోసాగాడు. ఆ ప్రయత్నంలో శర్వానంద్ ఎంపికకు తగిన చిత్రంగా ‘ప్రస్థానం’ నిలచింది. అందులోనూ అతని వైవిధ్యమైన అభినయం అలరించింది. ‘రన్ రాజా రన్’తో మరింత సక్సెస్ చూశాడు శర్వానంద్. ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’తో నటునిగా మంచి మార్కులు కొట్టేశాడు. ‘రాజాధిరాజా, ఎక్స్ ప్రెస్ రాజా’తో రాజాలా సాగినా, ‘శతమానం భవతి’తో కెరీర్ బెస్ట్ హిట్ పట్టేశాడు శర్వానంద్. “రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం” ఇలా పలు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు . అయితే ‘శతమానం భవతి’లాగా గ్రాండ్ సక్సెస్ తో పులకరించలేకపోయాడు.’మహాసముద్రం’లో సిద్ధార్థ్ తో కలసి శర్వానంద్ అలరించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆశించిన విజయం దరి చేరలేదు. తాజాగా శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ జనం ముందు నిలచింది. ఇందులోనూ శర్వానంద్ తనదైన అభినయంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. మునుముందు ఏ తరహా పాత్రలతో శర్వానంద్ అలరిస్తాడో చూడాలి.
