NTV Telugu Site icon

ప్రజ‌ల గొంతుక … గ‌ద్దర్ !

గ‌ద్దర్ పేరు విన‌గానే ఆయ‌న ముందున్న ప్రజాగాయ‌కుడు అన్న బిరుదు గుర్తుకు వ‌స్తుంది. ప్రజ‌ల ప‌క్షాన నిల‌చి, వారి క‌ష్టాల‌ను త‌న గ‌ళంలో నింపి ఊరూరా వాడ‌వాడ‌లా ప‌ల్లవించి, ప్రభుత్వాల‌ను దారికి తీసుకు వ‌చ్చిన క‌ళాకారుడు గ‌ద్దర్. ఆయ‌న పుట్టిన తేదీపై ప‌లు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామంది జ‌న‌వ‌రి 30వ తేదీన గ‌ద్దర్ పుట్టిన‌రోజు అని చెబుతారు. ప్రజా గాయ‌కుడు గ‌ద్దర్ అస‌లు పేరు గుమ్మ‌డి విఠ‌ల్ రావు. బ్రిటిష్ రాజ్యంలో తెల్లవారి పాల‌న‌ను వ్యతిరేకిస్తూ గ‌ద‌ర్ పార్టీ ఒక‌టి వెలుగు చూసింది. ఆ పార్టీ పేరునే త‌న క‌లం పేరుగా మార్చుకున్నారు గ‌ద్దర్. ఆయ‌న పాట‌లు ప‌లు చిత్రాల‌లో ప‌ల్లవించాయి. కొన్ని సినిమాల్లో గ‌ద్దర్ క‌నిపించారు కూడా! అలా చిత్రసీమ‌తోనూ గ‌ద్దర‌న్నకు అనుబంధం ఉంది.

గ‌ద్దర్ 1949లో మెద‌క్ జిల్లా తూప్రాన్ గ్రామంలో జ‌న్మించారు. ప‌ట్టుద‌ల‌తో ఉన్నత విద్యను అభ్యసించాల‌ని భావించారు. ఇంజ‌నీరింగ్ పూర్తి చేశారు. 1969లో సాగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చ‌దువుకొనే రోజుల నుంచీ ప్రజ‌ల క‌ష్టాల‌ను అర్థం చేసుకొని, వారి స‌మ‌స్యల‌పై పాట‌లు, బుర్రక‌థ‌లురాసి అల‌రించారు గ‌ద్దర్. త‌రువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత‌, ద‌ర్శకునిగా పేరొందిన బి.న‌ర‌సింగ‌రావు, గ‌ద్దర్ ను ఎంత‌గానో ప్రోత్సహించారు. 1971లో న‌ర‌సింగ‌రావు ప్రోత్సాహంతోనే ఆప‌ర‌...రిక్షా...అనే పాట రాశారు. ఆ ఆల్బమ్ గ‌ద్దర్ పేరుతోనే విడుద‌ల‌యింది. అప్పటి నుంచీ గుమ్మడి విఠ‌ల్ రావు కాస్తా గ‌ద్దర్గా నిల‌చిపోయారు. 1980లో బి.న‌ర‌సింగ‌రావు నిర్మించి, న‌టించిన మా భూమి చిత్రంలో గ‌ద్దర్ ఓ పాత్ర పోషించారు. అందులోనే బండి యాద‌గిరి రాసిన బండెన‌క బండి క‌ట్టి... ప‌ద‌హారు బండ్లు క‌ట్టి... పాట‌ను గ‌ద్దర్ స్వయంగా ఆల‌పించి, న‌టించారు. ఆ త‌రువాతి రోజుల్లో ఈ పాట విశేషాద‌ర‌ణ చూర‌గొంది. న‌క్సల్బరీ ఉద్యమంలోనూ గ‌ద్దర్ కీల‌క పాత్ర పోషించారు. ఆ నేప‌థ్యంలో క‌ట‌క‌టాలూ లెక్కపెట్టారు. ఆయ‌న పై హ‌త్యాయ‌త్నమూ జ‌రిగింది. అయితే అశేష ప్రజాభిమానంతో గ‌ద్దర్ బ‌తికి బ‌ట్ట క‌ట్టగ‌లిగారు.

దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శక‌త్వంలో ఆర్.నారాయ‌ణ మూర్తి న‌టించిన ఒరేయ్...రిక్షా కోసం గ‌ద్దర్ పాట‌లు ప‌లికించారు. అందులోని మ‌ల్లెతీగెకు పందిరివోలె... నీ పాదం మీద పుట్టుమ‌చ్చనై చెల్లెమ్మా... పాట ఎంత‌గానో అల‌రించింది. త‌రువాత జై బోలో తెలంగాణ‌ చిత్రం కోసం పొడుస్తున్న పొద్దు మీద ...పోరుతెలంగాణ‌మా... పాట‌ను రాయ‌డ‌మే కాదు, ఆ పాట పాడుతూ సినిమాలోనూ క‌నిపించారు. గ‌ద్దర్ పలికించిన అమ్మా తెలంగాణా... ఆక‌లి కేక‌ల గాన‌మా... పాట‌ను తెలంగాణ ఏర్పడ్డ త‌రువాత రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు. ఇప్పటికీ గ‌ద్దర్ ప్రజా స‌మ‌స్యల‌పై స్పందిస్తూనే ఉంటారు. ఆయ‌న మ‌రిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాల‌ని ఆశిద్దాం.