Site icon NTV Telugu

Jagapathi Babu Birthday: వైవిధ్యమే జగపతిబాబు ఆయుధం!

Jagapathi Babu1

Jagapathi Babu1

ఈ తరం వారికి జగపతిబాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా ఆకట్టుకుంటున్న తీరు వివరించక్కర్లేదు. కానీ, ఒకప్పుడు ‘మరో శోభన్ బాబు’ అనిపించుకున్నారు జగపతిబాబు. ఇద్దరు అమ్మాయిల నడుమ నలిగే పాత్రల్లో శోభన్ బాబు లాగే అలరించారు. అప్పట్లో హీరోగానూ తనదైన బాణీ పలికించారు జగపతిబాబు. కానీ, అప్పటి కంటే ఇప్పుడే జగపతిబాబు పరభాషా దర్శకులను సైతం ఆకర్షిస్తూ విలక్షణమైన పాత్రలు పోషిస్తూ పలు భాషల్లో నటిస్తూ ఉండడం విశేషంగా మారింది.

వీరమాచనేని జగపతిబాబు 1962 ఫిబ్రవరి 12న జన్మించారు. ఆయన తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ ‘జగపతి ఆర్ట్‌ పిక్చర్స్’ అధినేతగా సుప్రసిద్ధులు. రాజేంద్రప్రసాద్ దర్శకనిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్ తండ్రి పేరు జగపతి చౌదరి. ఆ పేరునే తన తనయునికి పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్.
జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ చిన్నకొడుకు జగపతిబాబు. అంత పెద్ద దర్శకనిర్మాత తనయుడు కాబట్టి జగపతిబాబుకు చిత్రసీమ ఎర్రతివాచీ పరచిందేమీలేదు. తండ్రి తొలుత జగపతిబాబు హీరోగా ‘సింహస్వప్నం’ నిర్మించారు. తొలి చిత్రంలోనే జగపతిబాబు ద్విపాత్రాభినయం చేశారు.

ఆ చిత్రం నిరాశను మిగిల్చింది. తరువాత సినిమాలు కూడా అంతగా అలరించలేదు. చివరకు జగపతిబాబు గొంతు కూడా కొందరు దర్శకులకు నచ్చలేదు. దాంతో వేరేవారితో జగపతిబాబుకు డబ్బింగ్ చెప్పించారు. ‘పెద్దరికం’ చిత్రం హీరోగా బాబుకు బ్రేక్ నిచ్చింది. ఈ చిత్రంలో జగపతిబాబుకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. తరువాత రామ్ గోపాల్ వర్మ ‘గాయం’నటునిగా గుర్తింపు తెచ్చింది. అందులో జగపతిబాబు తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ తరువాత వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూ సాగారు. ‘మావిచిగురు, మనోహరం’ చిత్రాలతో ఉత్తమ నటునిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. తరువాతి రోజుల్లో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గా ‘లక్ష్యం’ సినిమాతో నందిని అందుకున్నారు.

Read Also: Cruel Son: రూ.30లక్షలిస్తేనే తండ్రి శవాన్ని ఇంట్లోకి రానిస్తానన్న కొడుకు

జగపతిబాబు కాల్ షీట్స్ కు ఒకానొక సమయంలో విశేషమైన డిమాండ్ ఉండేది. ప్రేమికునిగా, ఇంటిపెద్దకొడుకుగా, ఓ మంచిభర్తగా, అన్యాయాన్ని ఎదిరించే ఆదర్శభావాల నాయకునిగా, న్యాయం కోసం పోరాడే యోధుడుగా ఇలా పలు విలక్షణమైన పాత్రల్లో అలరించారు జగపతిబాబు. అయితే హీరోగా తన స్టార్ డమ్ మసకబారుతున్న సమయంలోనే జగపతిబాబు కేరెక్టర్ రోల్స్ వైపు మళ్ళారు. కానీ, అప్పుడు అంతగా ఆకట్టుకోలేక పోయారు. కానీ, ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘లెజెండ్’ అనే చెప్పాలి. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ‘బెస్ట్ విలన్’ గా నంది అవార్డుకు ఎంపికయ్యారు జగపతిబాబు. ‘లెజెండ్’ తరువాత జగపతిబాబు కాల్ షీట్స్ కు ఎంత డిమాండ్ పెరిగిందో అందరికీ తెలుసు. పరభాషల్లోనూ జగపతిబాబు విలక్షణమైన పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు.

ఒకే తరహా పాత్రల్లో నటించినా, వాటిలో మూసధోరణి కనిపించకుండా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నంలో ఉన్నారు జగపతిబాబు. తాను ఎంత బిజీగా ఉన్నా, తనకు నచ్చిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ అలరిస్తున్నారు. నవతరం కథానాయకుల చిత్రాలలో జగపతిబాబు నటిస్తూండడం ఓ ఎస్సెట్ గా మారింది. ‘సింబా- ద ఫారెస్ట్ మేన్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’లోనూ జగపతిబాబు కీ రోల్ లో కనిపించనున్నారు. రాబోయే చిత్రాలతో జగపతిబాబు మరింతగా జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.

Read Also: G20 Food Festival: టేస్ట్ ది వరల్డ్.. ఢిల్లీలో 2-రోజుల పాటు జీ20 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్

Exit mobile version