Half Lion: ఓటిటీలో నెంబర్ 1 స్థానం సంపాదించడానికి ఆహా చాలా కష్టపడుతుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీని ఇస్తుంది. సినిమాలు, సిరీస్ లే కాకుండా సింగింగ్, డ్యాన్స్, కుకరీ షోస్ తో పాటు కామెడీ షోస్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది. ఇక తాజాగా ఆహా… ఒక అద్భుతమైన పాన్ ఇండియా సిరీస్ కు పునాది వేసింది. మాజీ భారత ప్రధాని పి.వి.నరసింహ రావు బయోపిక్ ను పాన్ ఇండియా సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు గారికి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించింది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు. ఇక ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి ప్రేక్షకులు తెలుసుకోవడానికి.. ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి భారతరత్నఅవార్డు గ్రహీత పి.వి.నరసింహారావు బయోపిక్ హాఫ్ లయన్ పేరుతో తెరకెక్కించనుంది. పలు భాషలలో రూపొందుతున్నఈ బయోపిక్ పి.వి.నరసింహారావు జీవిత చరిత్రను వివరిస్తుంది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లయన్ పుస్తకం ఆధారంగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రకాష్ ఝా ఈ సిరీస్‌కు రూపోందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబందించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మరి ఈ సిరీస్ తో ఆహా ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.
