ఇరవై ఎనిమిది సంవత్సరాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టిన రోజు ఇవాళ! ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న బయోగ్రాఫికల్ క్రైమ్ మూవీ ‘గంగూబాయి కతియావాది’లో ఆలియా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ యేడాది జూలై 30న విడుదల కాబోతున్న ఈ మూవీలోని ఆలియా పాత్రకు సంబంధించిన సీన్స్ తో చిన్నపాటి గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కామాటీ పురాలోని బ్రోతల్ హౌస్ నిర్వాహకురాలు గంగూబాయి పాత్రకు ఆలియా ప్రాణం పోసిందని ఈ విజువల్స్ చూస్తుంటే అర్థమౌతోంది. అలానే పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రను ఆలియా భట్ పోషిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళి ట్విట్ చేశారు. ఈ పోస్టర్ ఇలా వచ్చిందో లేదో అలా వైరల్ అయిపోతోంది. మరి కొద్ది గంటల్లోనే ఇది సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థలూ ఆలియా భట్ కు మెమొరబుల్ బర్త్ డే గిఫ్ట్స్ ను అందించాయనే చెప్పాలి. అన్నట్టు ఆలియా భట్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.