NTV Telugu Site icon

Gopichand: ‘భీమా’తో గోపీచంద్ ట్రాక్ ఎక్కుతాడా!?

Gopichand

Gopichand

Gopichand: మాస్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచే రూపం మేచోమేన్ గోపీచంద్ సొంతం. జూన్ 12తో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న గోపీచంద్ నటునిగా 30 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా ‘భీమా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘రామబాణం’తో 30 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ తన 31వ చిత్రంగా ‘భీమా’ను జనం ముందు నిలిపే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తూ ఉండగా, ఎ.హర్ష దర్శకత్వం వహించనున్నారు. ‘రామబాణం’లా రయ్యున దూసుకుపోలేక పోయినా, మొత్తానికి కొంత వరకూ సంతృప్తి చెందారు గోపీచంద్. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ‘భీమా’గా మెప్పించాలని తపిస్తున్నారు. 23 ఏళ్ళ వ్యవధిలో 30 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ కొన్నిసార్లు ఉప్పొంగిపోయే ఆనందంతో ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా సాగారు. మరికొన్నిసార్లు ఉస్సూరుమని కూలిన అలలా అయిపోయారు. ఎవరికైనా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. గతంలో తాను చూసిన అనూహ్యవిజయాల స్థాయిలో అలరించడానికి గోపీచంద్ మళ్ళీ సై అంటున్నారు. ఈ సారి ‘భీమా’లో వైవిధ్యంగా నటించాలని తపిస్తున్నారు. గతంలో ఇదే టైటిల్ తో విక్రమ్ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. తెలుగులో పాటల ప్రదర్శన కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘భీమా’ జనం ముందుకు రాలేదు. తమిళంలోనూ ఆ సినిమా అంతగా అలరించలేదు. ఈ నేపథ్యంలో ‘భీమా’ టైటిల్ ను గోపీచంద్ కొత్త చిత్రానికి తగిలించుకోవడంపై కొందరిలో సెంటిమెంట్స్ పొడసూపుతున్నాయి.

కృషినే నమ్ముకొని సినిమా రంగంలో అడుగుపెట్టిన గోపీ సదరు సెంటిమెంట్స్ ను పక్కకు నెట్టి ‘భీమా’గా మురిపించడానికే సిద్ధమయ్యారు. ఒకసారి బరిలోకి దిగితే వెనుతిరిగే ప్రసక్తే లేదు అన్నది గోపీచంద్ నైజం. తొలి సినిమా ‘తొలివలపు’ చేదు రుచి చూపించినా, గోపీచంద్ తన దరికి చేరిన అవకాశాలతో సాగాలని నిర్ణయించారు. “జయం, నిజం, వర్షం” వంటి చిత్రాలలో ప్రతినాయకునిగా మెప్పించాక మళ్ళీ కథానాయకునిగా కదం తొక్కాలనే తపించారు. ఆ
ప్రయత్నంలో గోపీచంద్ తండ్రి టి.కృష్ణకు అత్యంత సన్నిహితుడైన పోకూరి బాబూరావు నిర్మించిన ‘యజ్ఞం’ ప్రేక్షకాదరణ చూరగొంది. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో గోపీచంద్ కోరుకున్న స్టార్ డమ్ లభించింది. మరి వెనుదిరికి చూసుకోలేదు గోపి. ఆయన హీరోగా రూపొందిన “ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం, శంఖం” వంటి సినిమాలు విజయాలను అందించాయి. దాంతో గోపీచంద్ కోరుకున్న స్టార్ డమ్ ఆయనను పలకరించింది. ఆ పై వరుస పరాజయాలు పలకరించడంతో పట్టువదలని విక్రమార్కునిలాగే సాగారు.. ఆ సమయంలో ‘లౌక్యం’ గోపీచంద్ కు ఊరటనిచ్చింది. ‘లౌక్యం’ తరువాత వచ్చిన ‘జిల్’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచే మళ్ళీ గోపీచంద్ తో సక్సెస్ దోబూచులాడింది. ఆయన మాత్రం ప్రయత్నలోపం లేకుండా ముందుకు సాగారు. మధ్యలో పలు ఫ్లాపులు పలకరించాయి. ‘పక్కా కమర్షియల్’ పరవాలేదనిపించింది. ఇటీవల వచ్చిన ‘రామబాణం’ కొంత సంతృప్తిని కలిగించింది. అయినా మునుపటి స్థాయి సక్సెస్ మాత్రం గోపీచంద్ ను వరించలేదు. అందుకే ‘భీమా’గా వస్తానంటున్నారు గోపి. మరి ఈ సారయినా గోపీచంద్ అభిలాష నెరవేరి మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.