Suriya: కోలీవుడ్ హీరో సూర్ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరో రేంజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సూర్య త్వరలోనే సింగం 4 ను మొదలుపెట్టనున్నాడట. సూర్య కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులకు అతడిని దగ్గర చేసిన సినిమాలు మాత్రం గజినీ, యముడు మాత్రమే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా యముడు లో సూర్య నటన అద్భుతమని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సింగం సిరీస్ నడిచిన విషయం తెల్సిందే. సింగం 2, సింగం 3 సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ అన్నింటికి దర్శకత్వం వహించింది హరి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరి.. సింగం 4 ను ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట. పవర్ ఫుల్ కాప్ ను మళ్లీ బయటికి తీసుకురావడానికి మరింత పవర్ ఫుల్ స్టోరీని రాసుకున్నాడట. సూర్య సైతం ఈ కథను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సూర్య ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. హరి కూడా మరో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పట్టాలెక్కడానికి కనీసం 6 నెలలు అయినా పడుతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సూర్య ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి. మరి త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
