God Father: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు విడుదల కాగానే ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్ముకోవడం.. చిన్న సినిమాలు రాగానే ఆ ధరలను తగ్గించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో పెట్టుబడులు రావాలంటే టిక్కెట్ల ధరలను పెంచడమే ప్రత్యామ్నాయంగా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే విచిత్రంగా దసరా కానుకగా విడుదలయ్యే పెద్ద సినిమాల టిక్కెట్ ధరలను మాత్రం సాధారణ రేట్లకే విక్రయిస్తున్నారు. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ వంటి సినిమాల బుకింగ్స్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతోంది. ఈ మూవీకి సింగిల్ థియేటర్లలో రూ.150కే టిక్కెట్ విక్రయిస్తున్నారు. అటు మల్టీప్లెక్సులలో రూ.250గా ధరను నిర్ణయించారు. గతంలో ఆచార్య సినిమాకు మాత్రం సింగిల్ థియేటర్లలో ఒక్కో టిక్కెట్‌ను రూ.200కు విక్రయించగా మల్టీప్లెక్సులలో టిక్కెట్‌ను రూ.325కి విక్రయించారు.
Read Also:Adipurush: ‘ఆదిపురుష్’ నార్మల్ సినిమానా? బొమ్మల సినిమానా?
ఆచార్య సినిమాకు తక్కువ వసూళ్లు రావడానికి టిక్కెట్ రేట్లు కూడా కారణమని గ్రహించిన సినిమా పెద్దలు ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే గతంతో పోలిస్తే రూ.50 తక్కువగా టిక్కెట్లను విక్రయిస్తున్నారు. టిక్కెట్ రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ అభిమతమని పైకి కలరింగ్ ఇస్తున్నా.. అసలు విషయం మాత్రం సినిమా ఫలితం అటు ఇటు అయినా వసూళ్లపై ప్రభావం చూపకూడదనే సాధారణ రేట్లు ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అటు అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ సినిమాకు కూడా ఇవే ధరలను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అమలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీతో పోలిస్తే ది ఘోస్ట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా కనిపిస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ బుకింగ్స్ జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.