Site icon NTV Telugu

GINNA: తగ్గేదే లే అంటున్న మంచు విష్ణు!

Ginna First Look

Ginna First Look

 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి మూల కథను అందించగా, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే ను సమకూర్చడంతో పాటు కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆ మధ్య ఈ చిత్రానికి ‘జిన్నా’ పేరు పెట్టినప్పుడు బీజేపీతో సహా పలు హిందుత్వ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారతదేశాన్ని విభజిస్తూ, పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన జిన్నా పేరును ఈ చిత్రానికి పెట్టడంపై పలువురు విమర్శలు చేశారు. దానికి తోడు టైటిల్ మోషన్ పోస్టర్ లో ఏడు కొండల వెనక నుండి ‘జిన్నా’ పేరు రావడంపై విరుచుకు పడ్డారు. ఈ సినిమా పేరు మార్చాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ మీడియాలో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్నప్పుడు వారి అభ్యంతరాలను పరిశీలిస్తామని, అవసరమైతే విష్ణుకు చెప్పి పేరు మార్చుతామని అన్నారు. అయితే… పేరు మార్పు విషయంలో తగ్గేదే లే అంటున్నారు విష్ణు మంచు. ఈ విషయంపై వివరణ ఇవ్వడం మాట అటుంచి, జూలై 11న ‘జిన్నా’ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్నపాటి అనౌన్స్ మెంట్ వీడియోలో హనుమంతుడిని తొలుత చూపించారు. ఆ పైన మూవీ ప్రీ లుక్ అండ్ ఫస్ట్ లుక్ ను 11వ తేదీ ఉదయం 10.22కి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి టైటిల్ విషయంలో రాజీపడబోనంటున్న విష్ణు మంచుపై హిందుత్వ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Exit mobile version