చిత్ర పరిశ్రమలో టైటిల్ వివాదం అనేది అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటన. తాజాగా టైటిల్ విషయంలో వివాదం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ద ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్లింప్స్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. ద కిల్లింగ్ మిషన్ పేరుతో ఈ గ్లింప్స్ విడుదల చేశారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, రామ్మోహనరావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పుట్టిన రోజున ‘ఘోస్ట్’ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా నిర్మించనున్నట్లు పస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆగస్ట్ చివరి వారంలో షూటింగ్ మొదలు పెడుతున్నట్లు తెలియచేశారు. నాగ్ సినిమా ‘ద ఘోస్ట్’ అయితే ఇది ‘ఘోస్ట్’. నిజానికి గతంలో ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు ఏదో ఒక సినిమాకు పేరు తగిలించి విడుదల చేసేవారు. అలా ఇప్పుడు శివరాజ్ కుమార్ నటించే ‘ఘోస్ట్’ సినిమాకు శివరాజ్ కుమార్ ఘోస్ట్ అని పెట్టే అవకాశం ఉంది. అదీ కాక సునీల్ నారంగ్ నైజాం ఏరియాలో పేరు మోసిన పంపిణీదారుడు, ప్రదర్శనదారుడు. తనకి వ్యతిరేకంగా ఇక్కడ సినిమా విడుదల చేయాలంటే కష్టమైన వ్యవహారం. అదీ కాక నాగ్ సినిమా అక్టోబర్ లోనే రిలీజ్ అవుతోంది. శివరాజ్ కుమార్ సినిమా వచ్చే ఏడాది వరకూ విడుదలయ్యే అవకాశం లేదు. సో రెండు సినిమాల మధ్య ఎలాంటి క్లాష్ ఉండదు ఒక్క టైటిల్ విషయంలో తప్ప. మరి ఈ రెండు ‘ఘోస్ట్’లలో ఏ ఘోస్ట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూద్దాం.
