Site icon NTV Telugu

Gharana Mogudu Movie : మూడు పదుల ‘ఘరానా మొగుడు’

Gharana Mogudu

Gharana Mogudu

(ఏప్రిల్ 9తో ‘ఘరానామొగుడు’కు 30 ఏళ్ళు)
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు విజయదుందుభి మోగించాయి. అసలు చిరంజీవి కెరీర్ ను పరిశీలిస్తే రాఘవేంద్రరావు సినిమాలతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించినా, డాన్సులతో మంచి మార్కులు పోగేశారు. తరువాత యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘తిరుగులేని మనిషి’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు చిరంజీవి. ఆ సినిమా సైతం చిరంజీవికి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన తొలి చిత్రం ‘అడవిదొంగ’ సైతం ఘనవిజయం సాధించింది. తరువాత వారిద్దరి కాంబోలో మరికొన్ని సినిమాలు వెలుగు చూశాయి. అయితే ఆ పై వచ్చిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ 1990 బ్లాక్ బస్టర్ గా నిలచింది. 1991లో చిరుతో రాఘవేంద్రరావు తీసిన ‘రౌడీ అల్లుడు’ సైతం మంచి విజయాన్ని మూటకట్టుకుంది. ఇక 1992లో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ ఆ రెండు చిత్రాలకన్నా మిన్నయైన విజయం సాధించి, చిరు-కె.ఆర్.ఆర్. కాంబోకు మరపురాని హ్యాట్రిక్ ను అందించింది. ఆ ‘ఘరానా మొగుడు’ చిత్రం 1992 ఏప్రిల్ 9న జనం ముందు నిలచింది.

‘ఘరానా మొగుడు’ చిత్ర కథలోకి తొంగి చూస్తే – సాటి మనిషికి చేతనైన సాయం చేయాలన్న మంచి మనసుతో ఉంటాడు రాజు. ఆయన తల్లికి పక్షపాతం వచ్చిందని తెలియగానే వైజాగ్ లో పనిమానేసి హైదరాబాద్ వస్తాడు. వచ్చాక ఉద్యోగాల వేట ఆరంభిస్తాడు. బాపినీడు అనే బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు ఉమాదేవి బాగా చదువుకున్నదే అయినా తలబిరుసు మనిషి. తండ్రి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. మరో ధనికుడైన రంగనాయకులు, ఉమాదేవిని తన కొడుకు భార్య చేయాలని ఆశిస్తాడు. ఆ తండ్రీకొడుకులను ఉమాదేవి అందరి ముందు అవమానించి పంపుతుంది. పగపట్టిన రంగనాయకులు, తన గూండాలతో ఉమాదేవిని చంపించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ రోజు, ఆ కారులో ఉమాదేవికి బదులు ఆమె తండ్రి బాపినీడు ప్రయాణిస్తూ ఉంటాడు. గూండాలు బాపినీడుపై దాడిచేసే సమయంలో రాజు వచ్చి ఆయనను రక్షిస్తాడు. తనను రక్షించిన రాజుకు ఏదైనా సాయం చేయాలని ఆశిస్తాడు బాపినీడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తే చాలంటాడు రాజు. సరే, తాను చెప్పానని తన కూతురు ఉమాదేవిని కలవమని చెబుతాడు బాపినీడు.

రాజు వెళ్ళి ఉమాదేవిని కలుస్తాడు. ఆమె తలపొగరు చేష్టలతో అతణ్ణి అవమానిస్తుంది. తరువాత పొరపాటు తెలుసుకొని, అతనికి తన కంపెనీలో ఉద్యోగం ఇస్తుంది. అదే కంపెనీలో పనిచేసే భవానీతో రాజుకు పరిచయం అవుతుంది. రాజు అంటే ఆమె ప్రేమ పెంచుకుంటుంది. కానీ, రాజు తల్లి కోరిక మేరకు అతణ్ణి కావాలనుకుంటున్న ఉమాదేవిని పెళ్ళాడతాడు. పెళ్ళయ్యాక కూడా ఉమాదేవిలో మార్పు రాదు. ఎప్పటిలాగే తలబిరుసు తనంతో సాగుతుంది. ఆమెను దారికి తీసుకు రావడానికి రాజు భలే నాటకాలు ప్లే చేస్తాడు. అతను మాత్రం ఉమాదేవి భర్తగా కాకుండా, ఎప్పటిలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ గా నడచుకుంటూ ఉంటాడు. సదా వర్కర్స్ కోసం పాటు పడుతూ ఉంటాడు. ఈ లోగా ఉమాదేవిపై పగపట్టిన రంగనాయకులు, ఆమె మేనేజర్ సారంగపాణిని తనవైపు తిప్పుకుంటాడు. అతనితోనే ఉమాదేవికి తగిన బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తూంటాడు. అందులో భాగంగా కార్మిక పక్షం నిలచిన రాజు, ఉమాదేవి మధ్యనే చిచ్చు పెడతారు. రాజును తనవైపుకు రమ్మంటుంది ఉమాదేవి. కానీ, జనం వైపే ఉంటాడు. దాంతో అతణ్ణి జైలుకు పంపాలని భావిస్తుంది.

ఇది తెలిసిన రాజు తల్లి వచ్చి, ఉమాదేవిని ప్రాధేయపడుతుంది. అదే సమయంలో ఆమెకు హార్ట్ ఎటాక్ వస్తుంది. రాజు ఆవేశంతో ఉమ చెంప చెల్లు మనిపిస్తాడు. తన తల్లికంటే లోకంలో ఏదీ ఎక్కువ కాదని చెప్పి, అమ్మను ఆసుపత్రిలో చేర్పిస్తాడు. ఉమాదేవిలో పరివర్తన కలుగుతుంది. తన ఫ్యాక్టరీలో సగం వర్కర్స్ పేరిట రాయాలనుకుంటుంది. ఇది తెలిసిన ప్రత్యర్థులు ఆమె అక్కడ ఉండగానే ఫ్యాక్టరీకి నిప్పు పెడతారు. తల్లి చావుబతుకుల్లో ఉన్నా, వర్కర్స్ ప్రాణాలు కాపాడటానికి వస్తాడు రాజు. అదే సమయంలో భార్యనూ రక్షిస్తాడు. రాజు తల్లికి బాగవుతుంది. ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించమని కోరుతుంది ఉమాదేవి. తల్లి మాట మేరకు రాజు భార్యను క్షమించేయడంతో కథ ముగుస్తుంది.

చిరంజీవి, నగ్మా, వాణీవిశ్వనాథ్, రావు గోపాలరావు, సత్యనారాయణ, బ్రహ్మానందం, చలపతిరావు, శరత్ సక్సేనా, రమాప్రభ, శుభ, ఆహుతి ప్రసాద్, పొన్నాంబళం, సాక్షి రంగారావు, పి.యల్.నారాయణ, గౌతమ్ రాజు, డిస్కోశాంతి నటించారు. ఈ చిత్రాన్ని దేవీ ఫిలిమ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.దేవీవరప్రసాద్ నిర్మించారు.

ఈ చిత్రానికి కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘అనురాగ అరళితు’ ఆధారం. ఈ కథతో తమిళంలో రజనీకాంత్, విజయశాంతి జంటగా ‘మన్నన్’ తెరకెక్కింది. ఆ తరువాత తెలుగులో ‘ఘరానా మొగుడు’ వెలుగు చూసింది. కన్నడ చిత్రాన్నే తమిళంలో యథాతథంగా అనుసరించారు. తెలుగులో కొన్ని మార్పులు చేశారు. మాతృకలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అందులో తల్లికి పక్షపాతం వచ్చినప్పుడు హీరో పాట పాడడం ఉంటుంది. ఇందులో ఆ పాట లేదు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సమకూర్చిన సంగీతం పెద్ద ఎస్సెట్. ఇందులోని ఆరు పాటల్లో “కప్పుకో దుప్పటి…” అనే సాంగ్ ను కీరవాణి రాయగా, మిగిలిన పాటలన్నిటినీ భువనచంద్ర పలికించారు. “పండు పండు పండు…”, “ఏందిబే ఎట్టాగో ఉంది ఒళ్ళు…”, “హే పిల్లా హల్లో పిల్లా…”, “కిటుకులు తెలిసిన…” వంటి పాటలు అలరించాయి. అన్ని పాటలను మించి “బంగారు కోడిపెట్ట…” పాట జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.

‘ఘరానా మొగుడు’ ఆ రోజుల్లో అదరహో అనే ఓపెనింగ్స్ చూసింది. 56 కేంద్రాలలో వంద రోజులు, మూడు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ సంధ్య 70 ఎమ్.ఎమ్.లో ఏకధాటిగా 183 రోజులు ప్రదర్శితమైంది. అప్పట్లో రూ.10 కోట్లు చూసిన చిత్రంగా మంచి ప్రచారం సాగింది. ‘ఘరానా మొగుడు’ను మళయాళంలో ‘హే హీరో’గా అనువదించగా అక్కడా విజయం సాధించి, రజతోత్సవం చేసుకుంది.

Exit mobile version