Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?

Getup

Getup

సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఓ చిన్నపాటి తుపాను రేపిన “మేము కాపులం” వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒక వర్గం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసి, మరికొందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు గుట్టు విడిపోయింది. ఒక చిన్న వీడియో క్లిప్‌లో నటుడు గెటప్ శ్రీను, మెగా బ్రదర్ నాగబాబు కలిసి నటిస్తున్న ప్రాజెక్టుకు ‘మేము కాపులం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గెటప్ శ్రీను పేర్కొనగా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జాఫర్ స్పందిస్తూ.. “కులం పేరుతో సినిమాలు తీయడం ఏంటి? ఇది సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుంది? నాకు అస్సలు నచ్చలేదు” అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. దీంతో గెటప్ శ్రీను నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతా అని అంటూ వెళ్ళిపోవడం వైరల్ అవుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవ్వడంతో, నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఇదంతా ఒక తెలివైన ప్రమోషనల్ స్టంట్ అని తాజాగా స్పష్టమైంది. ఈ సిరీస్ అసలు టైటిల్ ‘మేము COPలం’ (Memu COPulam). ఇక్కడ COP అంటే ఆంగ్లంలో పోలీస్ అని అర్థం. అంటే ఈ సిరీస్ పోలీసుల చుట్టూ, వారి విధుల్లో ఎదురయ్యే కామెడీ మరియు సవాళ్ల చుట్టూ తిరుగుతుందని టీం క్లారిటీ ఇచ్చింది. ఉచ్చారణలో రెండు పదాలు ఒకేలా ఉండటంతో వచ్చిన చిన్నపాటి కన్ఫ్యూజన్‌ను మేకర్స్ తమ సిరీస్ పబ్లిసిటీకి చాలా చాకచక్యంగా వాడుకున్నారు. ఓటీటీ జీ5 (ZEE5) ఒరిజినల్స్‌లో భాగంగా ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ కామెడీ అని సమాచారం. పోలీసు శాఖలో జరిగే ఆసక్తికర పరిణామాలు, మన చుట్టూ ఉండే నేరగాళ్లను పోలీసులు తమదైన స్టైల్లో ఎలా పట్టుకుంటారనేది హిలేరియస్ గా చూపించబోతున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్, విడుదల తేదీ గురించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. పోలీసు డ్రెస్సులో గెటప్ శ్రీను పండించే కామెడీని చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!