Site icon NTV Telugu

Sunil movies back to back: ‘గీత’ ఆగమనానికి ముహూర్తం కుదిరింది!

Geetha

Geetha

Sunil movies back to back: ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా ‘గీత’. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన ఈ చిత్రంలో ‘గీత’గా టైటిల్ రోల్ ప్లే చేసింది ప్రముఖ కథానాయిక హెబ్బా పటేల్. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఈ మూవీ ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ‘గీత’ సినిమాను ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో పోషించడం ఓ విశేషం కాగా, సునీల్ ఓ ప్రధానమైన పాత్రలో కనిపించబోతున్నారు. అలానే ‘నువ్వే కావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలలో హీరోగా నటించిన సాయికిరణ్ ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు.

సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, ”ఈ సినిమా అవకాశం నా గురువు, దైవ సమానులు వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓ సామాజికాంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా కథ తయారు చేశాను. సుభాష్‌ ఆనంద్ సంగీతం, చిన్నా నేపథ్య సంగీతం మూవీకి హైలైట్ గా నిలుస్తాయి” అని అన్నారు. నిర్మాత ఆర్. రాచయ్య మాట్లాడుతూ, ”గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే.. ‘గీత’ చిత్రం ఈ నెల 26న వస్తోంది. దానిలో సునీల్ ఓ కీలకమైన పాత్ర పోషించారు. అలానే ఈ నెల 27న సునీల్ కీ-రోల్ ప్లే చేసిన మరో సినిమా ‘బుజ్జి ఇలా రా’ రిలీజ్ కాబోతోంది. ఆ రకంగా సునీల్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి.

Exit mobile version