ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కుమారుడు లక్ష్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు మూవీకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని, సినిమా బాగుందంటూ అభినందించారని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని, ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కుతోందని చెప్పారు.
“వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుందని, ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ సబ్జెక్టుతో రానుందో దీనితో స్పష్టం చేసిందని నిర్మాత అన్నారు. వేదిక దత్త, ‘వెన్నెల’ కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, సమ్మెట గాంధీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగుతో పాటు ఈ నెల 24న తమిళంలోనూ రిలీజ్ చేస్తుండటం విశేషం.