Site icon NTV Telugu

Dil Raju: షూటింగ్స్ ఆపేశాం.. నాలుగు కమిటీలు పని చేస్తున్నాయి

Dil Raju On Tollywood Issue

Dil Raju On Tollywood Issue

Four Committees Held To Solve Industry Problems Says Dil Raju: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేసినా, తన ‘వరిసు’ సినిమా చిత్రీకరణను కొనసాగించడంతో నిర్మాత దిల్‌రాజుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు నిర్మాతల మధ్యే విభేదాలు తలెత్తాయంటూ ప్రచారాలు జరిగాయి. వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కళ్యాణ్ కొట్టిపారేశారు. తమ మధ్య విభేదాలు లేవని, దిల్‌రాజుని కార్నర్ చేసి మాట్లాడటం సరికాదని, ఆయన సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చిస్తున్నానన్నారు. ఇదే సమయంలో దిల్ రాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మొత్తం నాలుగు కమిటీలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

థియేటర్లలో సినిమాల్ని విడుదల చేసిన తర్వాత.. ఎన్ని వారాలకు ఓటీటీకు వెళ్తే మంచిదన్న విషయంపై వర్క్ చేసేందుకు ఒక కమిటీ వేశామన్నారు. రెండవది.. థియేటర్స్‌లో వీపీఎఫ్ ఛార్జీల పర్సెంటెంజ్‌లు ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నాయన్నారు. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్‌తో చర్చిస్తుందని తెలిపారు. మూడవది.. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్‌పై నివేదిక తయారు చేస్తోందని పేర్కొన్నారు. ఇక నాల్గవది.. నిర్మాతలకు ప్రొడక్షన్‌లో వేస్టేజ్, వర్కింగ్ కండిషన్స్, ఎన్ని గంటలపాటు షూటింగ్స్ జరగాలన్న విషయాలను పరిశీలిస్తోందన్నారు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే ఈ నాలుగు కమిటీలు వేయడం జరిగిందని, ఈ కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయని దిల్ రాజు వెల్లడించారు.

సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు రాస్తున్నారని, వాటిని నమ్మొద్దని దిల్ రాజు కోరారు. తమకు ఫిలిం ఛాంబర్ ఒక్కటే ఫైనల్ అన్నారు. నెలల తరబడి షూటింగ్ ఆపాలన్న ఉద్దేశం తమకు లేదని, నిర్మాతలకు భారం కాకుండా త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గత మూడు రోజుల నుంచి నాలుగు మీటింగ్స్ జరిగాయని, తెలుగు సినిమా ఎలా ఉండాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే రిజల్ట్ వస్తుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Exit mobile version