NTV Telugu Site icon

Forty years of ‘Devata’ Movie : నలభై ఏళ్ళ సురేశ్ ప్రొడక్షన్స్ ‘దేవత’

Devatha

Devatha

పాత టైటిల్స్ మళ్ళీ పలకరించడం, పాత కథలే కొత్త నగిషీలతో అలరించడం సినిమా రంగంలో పరిపాటే! ‘దేవత’ టైటిల్ అనగానే పాత తరం వారికి చప్పున యన్టీఆర్ – సావిత్రి నటించిన ‘దేవత’ గుర్తుకు వస్తుంది. మరింత పాతవారికి నాగయ్య, కుమారితో తెరకెక్కిన బి.యన్.రెడ్డి ‘దేవత’ కూడా స్ఫురిస్తుంది. అదే టైటిల్ తో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద కాంబినేషన్ లో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించింది. డి. రామానాయుడు నిర్మించిన ఈ ‘దేవత’ 1982 సెప్టెంబర్ 10న విడుదలై విజయఢంకా మోగించి, ఆ యేడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. టైటిల్ పాతదే, ఇందులోని కథ కూడా ఓ నాటి ఏయన్నార్, బి.సరోజాదేవి నటించిన ‘పెళ్ళికానుక’ను గుర్తుకు తెస్తుంది. అలా పాతదనంతోనే ప్రేక్షకులను ఎంతగానో మురిపించిందీ ‘దేవత’.

‘దేవత’ కథ విషయానికి వస్తే – ఓ ఊరిలో స్థితిమంతులైన వారి అబ్బాయి రాంబాబు. లాయర్ గిరి చదువుతూ ఉంటాడు. అదే ఊరిలోని అక్కాచెల్లెళ్ళు జానకి, లలిత ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అనాథలైన వారి ఆలనాపాలనా ఆ ఊరి ప్రెసిడెంట్ నరసయ్య చూస్తూ ఉంటాడు. రాంబాబు, లలిత ప్రేమించుకుంటారు. రాంబాబు తల్లి ఏ పని చెప్పినా చేస్తూ ఉంటుంది జానకి. ఆమెను తన కోడలు చేసుకోవాలని రాంబాబు తల్లి భావిస్తుంది. ఆ విషయం జానకిని అడుగుతుంది. ఆమె సరే అంటుంది. చెల్లికి ఈ విషయం చెప్పాలని తహతహలాడుతుంది జానకి. అలాగే తాను రాంబాబును ప్రేమించిన విషయం అక్కకు చెప్పాలని ఉవ్విళ్ళూరుతుంది లలిత. నువ్వు ముందు చెప్పు, నువ్వు ముందు చెప్పు అంటూ పోటీలు పడతారు అక్కాచెల్లెళ్ళు. చివరకు పెద్దదానివి నువ్వే చెప్పు అంటే రాంబాబుతో తన పెళ్ళి గురించి చెబుతుంది జానకి. దాంతో చెల్లి అక్క కోసం త్యాగం చేస్తుంది. తనను కాదని, అక్క జానకిని రాంబాబు పెళ్ళాడాలంటే ఎవరికీ నచ్చని పని చేయాలని భావిస్తుంది. ఆ ఊరిలో పనికిమాలిన వెధవగా పేరొందిన కామేశాన్ని పెళ్ళాడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. కామేశం, లలిత రైళ్ళో వెళుతూ ఉండగా ఓ గొడవలో ఓ వ్యక్తిని కామేశం పొడిచేస్తాడు. జైలుకు వెళతాడు. రాంబాబు, జానకి పెళ్ళి చేసుకుంటారు. వారికి పిల్లలు ఉండరు. పట్నం వెళతారు. అక్కడ లాయర్ గా ప్రాక్టీస్ పెడతాడు రాంబాబు. లలిత, రాంబాబు ప్రేమపలంగా ఓ బాబుకు జన్మనిస్తుంది. వాడిని పెంచుకుంటూ ఉంటుంది. జైలు నుండి విడుదలై వచ్చిన కామేశం, తనతో కాపురం చేయకుండానే ఎలా బిడ్డ పుట్టాడని నిలదీస్తాడు. రాంబాబు, లలిత కొడుకును చేరదీస్తాడు. ఆ బాబునే తన బిడ్డగా భావిస్తుంది జానకి. తరువాత జానకి ఓ ఆడపాపకు జన్మనిస్తుంది. అయితే రాంబాబు, లలిత మధ్య అక్రమ సంబంధం ఉందని అంటుంది జానకి. కామేశం, లలితను చంపబోతాడు. ఆమెనే వాడిని చంపేసి జైలుకు వెళ్తుంది. లలిత తరపున వాదించి, ఏ పరిస్థితుల్లో ఆమె హత్య చేయవలసి వచ్చిందో నిరూపించి, ఆమెకు శిక్ష పడకుండా చేస్తాడు రాంబాబు. వేరే ఊరిలో బతకాలని లలిత, తన బాబును తీసుకు వెళ్తుంది. రాంబాబు దగ్గరుండి రైలు ఎక్కిస్తాడు. అయితే అప్పటికే లలిత తన కోసమే రాంబాబుపై ప్రేమను త్యాగం చేసిందని బాబాయ్ నరసయ్య ద్వారా తెలుసుకుంటుంది జానకి. దాంతో ఆమె మరణించాలని భావిస్తుంది. రాంబాబు వెళ్ళి లలితను, బాబును తీసుకు వస్తాడు. భర్తను, పాపను లలిత చేతిలో పెట్టి జానకి కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో రావు గోపాలరావు, మోహన్ బాబు, నిర్మలమ్మ, పుష్పలత, నగేశ్, రమాప్రభ, సారథి, మమత, గిరిజారాణి, జయవాణి, జానకి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, ఆత్రేయ, వేటూరి పాటలు పలికించారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని “వెల్లువొచ్చి గోదారమ్మా…”, “కుడి కన్ను కొట్టగానే…”, “ఎండావానా నీలాడాయి…”, “చీరకట్టింది సింగారం…”, “చల్లగాలి చెప్పింది…” అంటూ సాగే పాటలు విశేషంగా అలరించాయి. ఈ చిత్రం 19 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ అపజయాల బాటలో పయనిస్తున్న సమయంలో భారీ విజయాన్ని అందించిన చిత్రంగా ‘దేవత’ నిలచింది. ఇందులోని ‘వెల్లువొచ్చి గోదారమ్మా…’ పాట ఆ రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించింది. ఆ పాటను ఈ మధ్య ‘గద్దలకొండ గణేశ్’ చిత్రంలో రీమిక్స్ చేయడం విశేషం!

అక్కాచెల్లెళ్ళు ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకున్నారు కాబట్టిఈ సినిమాకు ‘దేవతలు’ అని టైటిల్ పెడితే బాగుండేదని కొందరన్నారు. అయితే ఇందులో లలిత పాత్రనే దేవతగా తీర్చిదిద్దినా, ఆ టైటిల్ ఆమెకు వర్తించదనీ కొందరు వాదించారు. ఎందుకంటే ఆమె అక్క కోసం త్యాగం చేసినా, అటు ప్రేమించిన వాడికీ, ఇటు కట్టుకున్న వాడికీ ఇద్దరికీ మోసం చేసిందని అందువల్ల ఆమె దేవత ఎలా అవుతుందని వారి వాదన! ఏది ఏమైనా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలో సురేశ్ సంస్థనే ‘తోఫా’ పేరుతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే జితేంద్ర, శ్రీదేవి, జయప్రద కాంబోలో నిర్మించగా, అక్కడా అలరించింది. తమిళంలో మోహన్, రాధిక, ఊర్వశి కాంబినేషన్ లో రామానాయుడు ‘దైవపిరవి’ పేరుతో ఈ సినిమాను నిర్మించగా తమిళనాట కూడా విజయం సాధించింది.