NTV Telugu Site icon

Chiranjeevi : నలభై ఏళ్ళ ‘శుభలేఖ’

Subha Lekha

Subha Lekha

కాలం మారుతున్నా కట్నకానుకల ఊసు కరగిపోవడం లేదు. ఒకప్పుడు ‘కన్యాశుల్కం’, ఆ పైన ‘వరకట్నం’ అన్న దురాచారాలు జనాన్ని కుదిపేశాయి. వీటిని నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక చిత్రాలు వెలుగు చూశాయి. గురజాడ సుప్రసిద్ధ నాటకం ఆధారంగా తెరకెక్కిన పి.పులయ్య ‘కన్యాశుల్కం’, యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘వరకట్నం’ ఆ కోవకు చెందిన చిత్రాలే! కె.విశ్వనాథ్ కూడా 40 ఏళ్ళ క్రితం ఆ దిశగా పయనిస్తూ రూపొందించిన చిత్రం ‘శుభలేఖ’. అప్పట్లో వర్ధమాన నటునిగా సాగుతున్న చిరంజీవికి ‘శుభలేఖ’ మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమా ద్వారా పరిచయమైన సుధాకర్ ఈ చిత్రం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న వైనమూ తెలిసిందే! 1982 జూన్ 11న విడుదలైన ‘శుభలేఖ’ చిత్రం మంచి విజయం సాధించింది.

‘శుభలేఖ’ కథ ఏమిటంటే – విశాఖపట్టణం డాల్ఫిన్ హోటల్ లో డిగ్రీ చదివినా సరైన ఉద్యోగం దొరక్క వెయిటర్ గా పనిచేస్తుంటాడు నరసింహమూర్తి. సంస్కారంతో పాటు కొన్ని లలిత కళల్లోనూ అతనికి ప్రావీణ్యం ఉంటుంది. అంతేకాదు, అన్యాయం ఎక్కడ జరిగినా దానిని ఎదిరించే గుణమూ మూర్తి సొంతం. అతనికి లెక్చరర్ సుజాత పరిచయం అవుతుంది. ఆమె కౌన్సిలర్ అంకెల ఆదిశేషయ్య కాలేజ్ లో పనిచేస్తూ ఉంటుంది. తన కొడుకులు మోహన్, మురళి ఇద్దరినీ బాగా చదివించి ఉంటాడు, దండిగా కట్నం పుచ్చుకోవాలని ఆదిశేషయ్య ఆశ. సుజాతను తన పెద్దకొడుకు మోహన్ కు ఇచ్చి పెళ్ళి చేయాలని భావిస్తాడు. సుజాత ఆయన కట్నకానుకల చిట్టా చూసి, ఆ పెళ్ళికి అంగీకరించదు. అదే సమయంలో పార్టీకి కేటరింగ్ చేస్తోన్న మూర్తికి, సుజాత భావాలు నచ్చుతాయి. ఆదిశేషయ్యను సన్మానిస్తామని మూర్తి ఓ వేదికపై అవమానిస్తాడు. అతనికి ఉద్యోగం పోతుంది. సుజాతకు కూడా అదే పరిస్థితి. ఆమెకు మూర్తి అండగా నిలుస్తాడు. సుజాత ఇంట్లో వాళ్ళు సైతం అనుమానిస్తారు. సుజాతను హైదరాబాద్ తీసుకు వచ్చి, ఆమెను ఓ కంపెనీలో గౌరవనీయమైన స్థానంలో నిలుపుతాడు మూర్తి. ఆమెకు అదే కంపెనీలోని ఓ హోదా ఉన్న ఉద్యోగితో పెళ్ళి చేయాలని నిశ్చయిస్తాడు మూర్తి. ఇదిలా సాగుతూ ఉండగా, ఆదిశేషయ్య చిన్నకొడుకు మురళిని, సుజాత చెల్లెలు లక్ష్మి ప్రేమించి కాణీ కట్నం ఇవ్వకుండా పెళ్ళాడుతుంది. తమ్ముడిని చూసి జ్ఞానోదయమైన మోహన్, ఓ విడోను పైసా కట్నం లేకుండా మనువాడతాడు. మూర్తి మంచితనానికి సుజాత ఇంట్లోవాళ్ళందరూ కరిగిపోతారు. చివరకు సుజాత, మూర్తినే పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.

చిరంజీవి, సుమలత, తులసి, శుభలేఖ సుధాకర్, సత్యనారాయణ, రమణమూర్తి, రాళ్ళపల్లి, సాక్షి రంగారావు, గిరిశ్, అరుణ్, పొట్టి ప్రసాద్, వంకాయల, హేమసుందర్, ధమ్, అనుపమ, నిర్మలమ్మ నటించిన ఈ చిత్రానికి గొల్లపూడి మారుతీరావు రచన చేశారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె.విశ్వనాథ్ సమకూర్చారు. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ స్వరకల్పన చేయగా, వేటూరి పాటలు పలికించారు. సందర్భోచితంగా అన్నమయ్య కీర్తనల్లో “నెయ్యములల్లో నేరెళ్లో…”, “విన్నపాలు వినవలె…” అంటూ సాగేవి ఉపయోగించుకున్నారు. అలాగే త్యాగరాజ కీర్తన “మరుగేలరా…ఓ రాఘవా…” ఇందులో చోటు చేసుకుంది. “రాగాల పల్లకిలో కోయిలమ్మ…”, “అయితే… అదే నిజమైతే…”, “నీ జడ కుప్పెలు…”, “ఓహో… తద్ధిమి తకజను…” అంటూ సాగే పాటలూ అలరించాయి.

కె.విశ్వనాథ్ కు ఓ అలవాటుంది. తాను రాసుకున్న కథలనే అటు ఇటుగా చేసి, మళ్ళీ తెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు. అంతకు ముందు యన్టీఆర్ తో తీసిన ‘నిండుదంపతులు’ చిత్రాన్ని తరువాత కృష్ణంరాజుతో ‘అల్లుడు పట్టిన భరతం’గానూ, ఆ పై ‘స్వయంకృషి’గానూ కొద్ది పాటి మార్పులతో రూపొందించారు. అదే తీరున విశ్వనాథ్ తాను తీసిన ‘సిరిసిరి మువ్వ’ కథకే నేపథ్యం మార్చి, ‘శుభలేఖ’గా తీర్చిదిద్దారు. ఆ తరువాత ఇదే అంశంతో ‘స్వర్ణకమలం’ సాగుతుంది. ఈ మూడు చిత్రాలలోనూ హీరోయిన్ కు అండగా నిలచి ఆమెలో ఆత్మస్థైర్యం నింపే కథానాయకుడు మనకు కనిపిస్తాడు.

‘శుభలేఖ’ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం ద్వారా కె.విశ్వనాథ్ కు బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు లభించింది. ఇక ఈ సినిమాతోనే చిరంజీవి ఉత్తమ నటునిగా తన తొలి ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. కె.విశ్వనాథ్ కు తెలుగు చిత్ర విభాగంలో ఉత్తమ దర్శకునిగా ఫిలిమ్ ఫేర్ లభించింది. కట్నకానుకలపై ఇప్పటికీ అబ్బాయిల కన్నవారు కనికరం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఈ తరహా చిత్రాలు ఏ మేరకు కనువిప్పు కలిగించాయో చెప్పలేం కానీ, భావితరాలను సైతం ఆకట్టుకొనేలా ‘శుభలేఖ’ తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది.

Show comments