Site icon NTV Telugu

Krishna : నలభై ఐదేళ్ళ ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’!

Jaya Pradha

Jaya Pradha

చిత్రసీమలో కొన్ని బంధాలు, అనుబంధాలు చూస్తే ఏనాటివో అనిపించక మానదు. హీరో కృష్ణ, నటదర్శకనిర్మాత ఎమ్.బాలయ్య బంధం అలాంటిదే! ఇక కృష్ణ, జయప్రద జోడీ కూడా ప్రత్యేకమైనదే- ఎందుకంటే కృష్ణ సరసన విజయనిర్మల తరువాత అత్యధిక చిత్రాలలో నాయికగా నటించిన క్రెడిట్ జయప్రదకే దక్కింది. ఇలా అనుబంధం ఉన్న వీరి కలయికలో ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ అనే చిత్రం తెరకెక్కింది. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.బాలయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు. 1977 జూన్ 8న ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ చిత్రం విడుదలయింది.

సింహగిరి రాజాకు పిల్లలు ఉండరు. రెండో భార్య, ఆమె తమ్ముడు ఉండగానే ఆయన గతిస్తారు. చనిపోతూ తన సింహగిరి వారసులు ఎవరైనా కనిపిస్తే, వారికి ఆస్తి చెందాలని వీలునామా రాస్తారు. సంవత్సరంలోగా సింహగిరి వారసులు ఎవరూ దొరక్కపోతే ఆస్తి మొత్తం రెండో భార్యకే చెందుతుందనీ ఆ వీలునామాలో ఉంటుంది. అయితే నిజాయితీగల లాయర్ సింహగిరి వారసుల కోసం వెతికిస్తాడు. ఓ మారుమూల గ్రామంలో సింహగిరి వంశానికి చెందిన సుబ్బయ్యకు తాను రాజావారి మూడోతరం వాడినని తెలుస్తుంది. సింహగిరి రాజావారి లాయర్ దగ్గరకు ఓ కేసు విషయమై వచ్చిన దయాసాగర్ కు ఈ విషయం తెలుస్తుంది. సింహగిరి రాజా వారి ఆస్తి కాజేసేందుకు తన దగ్గర పనిచేసే రంగడిని ఓ జమీందార్ లా తయారు చేసి నాటకమాడిస్తాడు. సుబ్బయ్య కూతురు సీతతో పెళ్ళి జరిగేలా చేస్తాడు. రాజా రెండో భార్య తమ్మునితో కలసి ఓ పథకం వేస్తాడు. అందులో భాగంగా సీతను చంపేస్తే ఆస్తి భర్తకు వస్తుందని, తద్వారా రంగడి నుండి తాము ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చునని భావిస్తారు. రంగడికి ఈ దురాలోచన తెలుస్తుంది. రంగడు అందరికీ దేహశుద్ధి చేసి దోషులను చట్టానికి అప్పగిస్తాడు. రంగడు నిజాయితీగా అందరినీ కలిపి, తానో బజారు మనిషిని బజారులోకి వెళతానని అంటాడు. అతని భార్య సీత అడ్డు పడి తమ బంధం ఈ నాటిది కాదు ఏనాటిదో అని చెప్పి అతణ్ణి ఆపేయడంతో కథ ముగుస్తుంది.

కృష్ణ, జయప్రద, నాగభూషణం, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, సత్యేంద్రకుమార్, ఎమ్.బాలయ్య, జయలక్ష్మి, రాధాకుమారి, ఝాన్సీ నటించిన ఈచిత్రానికి అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు నిర్మాతలు. కథ, స్క్రీన్ ప్లే బాలయ్య అందించగా, అప్పలాచార్య మాటలు పలికించారు. యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, యమ్.బాలయ్య పాటలు రాశారు. “నారసింహుడొచ్చెను…”, “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకీ…”, “అరె అరె గోతిలో పడ్డాడే…”, “నేననుకున్నది కాదు ఇది…”, “ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది…” అంటూ సాగే పాటలు అలరించాయి.

Exit mobile version