Site icon NTV Telugu

Pawan Kalyan: ఖుషీగా త్రివిక్రమ్ ఆవిష్కరించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్!

First Day First Show

First Day First Show

 

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మూడో తరం ఇప్పుడు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, నటుడు శ్రీరామ్ కుమార్తె శ్రీ‌జ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేసి మేకర్స్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీజర్‌ ఆసక్తికరంగా వుందని ప్రశంసించిన ఆయన, ప్రాజెక్ట్‌ కు కలిసి పనిచేసిన యంగ్ టీమ్ ని అభినందించారు. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా విడుదల గురించి ఒక హిందీ వాయిస్ ఓవర్ లో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఖుషి’ సినిమా రిలీజ్ టైమ్ లో జరిగిన కథగా ఈ మూవీ వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. తన గర్ల్ ఫ్రెండ్ ని ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్లని సంపాదించే క్రమంలో హీరో పడిన ఇబ్బందుల చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. థియేటర్ దగ్గర పవన్ అభిమానులు చేసే హంగామా, ఆ సమయంలో ఊరిలో ఉండే వాతావరణం టీజర్ లో చక్కగా చూపించారు. మరి ఇంత చిన్న పాయింట్ తీసుకుని దర్శకులు ఈ కథను ఆసక్తికరంగా ఎలా మలిచారన్నది చూడాల్సిందే!

 

శ్రీకాంత్ రెడ్డి, సంచితా బాసు జంటగా నటించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, తనికెళ్ళ భరణి, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ ‘మజ్జా మజ్జా’ చక్కని ఆదరణ పొంది, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తో రిజిల్, జోష్ , చింగారి వంటి షార్ట్ వీడియో యాప్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని తెలియచేస్తామని సమర్పకులు ఏడిద శ్రీరామ్ తెలిపారు.

 

 

Exit mobile version