(సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి కన్నుమూత)
మండు వేసవిలో ఎక్కడైనా వాన కురిస్తే నాసిక పుటాలకు సోకే మట్టివాసన మహదానందం కలిగిస్తుంది. అదే సమయంలో పిల్లగాలితో కలసి చినుకుల సవ్వడి కూడా పలకరిస్తే మది పులకరిస్తుంది. వానకు ముందు వినిపించే హోరు గాలి సైతం పరవశింప చేస్తుంది. ఈ ఉపమానాలన్ని ఎందుకంటే సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి స్వరకల్పన ఝంఝామారుతంలా మదిని చిందులు వేయించేది. పాశ్చాత్య పోకడలతో హిందుస్థానీ సంగీతం సన్నగిల్లిపోతోందని సంగీతాభిమానులు విచారిస్తున్న తరుణంలో ప్రతీచ్య బాణీలకు ప్రాచ్య స్వరాలు కలగలిపి విశేషంగా వీనులవిందు చేసిన ఘనత బప్పి లహిరి సొంతం. డిస్కోను ఓ పట్టు పట్టి, దానిలోనూ గుట్టుగా మన రాగాలను నెట్టి ఆకట్టుకున్న బప్పి లహిరి కనికట్టును ఎవరు మాత్రం మరచిపోగలరు. యావద్భారతదేశం బప్పి బాణీలకు ఊగింది, తూగింది, ఊగి తూగింది, తూగి ఊగింది. బప్పి మ్యూజిక్ మ్యాజిక్ తలచుకుంటూ ఉంటే యాద్ ఆ రహా హై... అంటూ అసంకల్పితంగా మనలోని గాయకులు తన్నుకొని రాక మానరు.
బప్పి లహిరి బాలమేధావి అని పేరు గాంచారు. కేవలం మూడేళ్ళ ప్రాయంలోనే పండితులు ఆశ్చర్యపోయేలా, పామరులు స్తంభించి పోయేలా తబలా వాయించేవారు. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురిలో 1952 నవంబర్ 27న బప్పి లహిరి జన్మించారు. ప్రఖ్యాత నటులు అశోక్ కుమార్, విఖ్యాత గాయకుడు,నటుడు కిశోర్ కుమార్ కు బప్పి స్వయానా మేనల్లుడు. బప్పి కన్నవారు సైతం సంగీతంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవారు. దాంతో తల్లిదండ్రుల వద్దే సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్నారు బప్పి. ఆ తరువాత అనేక సంగీత దర్శకుల బాణీలను పరిశీలిస్తూ, వారికి భిన్నంగా తాను స్వరవిన్యాసాలు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. తన మేనమామ కిశోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బడ్తి కా నామ్ దాడీ చిత్రంలో భోపు పాత్రలో బప్పి లహిరి నటించారు. ఇందులో కిశోర్ సోదరులు అశోక్ కుమార్, అమిత్ కుమార్ కూడా నటించడం విశేషం! ఈ చిత్రానికి కిశోర్ కుమార్ స్వయంగా స్వరకల్పన చేశారు. అందులోని ఎక్కువ పాటలకు బప్పినే బాణీలు కట్టారు. అంతే కాదు యే జవానీ దిన్ చార్... అనే పాటనూ పాడి అలరించారు బప్పి లహిరి. ఈ చిత్రం 1974లో వెలుగు చూసింది. అంతకు ముందే 1973లో బప్పి లహిరి నన్హా షికారీ అనే చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆపై చరిత్ర, బజార్ బంద్ కరో, ఏక్ లడ్కీ బద్నామ్ సి వంటి చిత్రాలకు స్వరకల్పన చేశారు బప్పి. అయితే ఆయనకు సంగీత దర్శకునిగా మంచి గుర్తింపును ఇచ్చిన చిత్రం 1975లో విడుదలైన జక్మీ. ఇందులోని ఆవో తుమ్ చాంద్ పే లే జాయే..., అభీ అభీ థీ దుష్మనీ..., జక్మీ దిలోంకా బద్లా... వంటి మధురగీతాలు జనాన్ని కట్టి పడేశాయి.
బప్పి లహిరి స్వరకల్పనలో ఆ పై చల్తే చల్తే, టూటే ఖిలోనా, లాహూ కే దో రంగ్, జ్యోతి వంటి మ్యూజికల్ హిట్స్ వెలుగు చూశాయి. ఇక యావద్భారతం బప్పి లహిరి నామస్మరణ చేసేలా చేసిన చిత్రం డిస్కో డాన్సర్. ఇందులోని ఐ యామ్ఏ డిస్కో డాన్సర్... పాట నాటి యువతను ఓ ఊపు ఊపేసింది. రోడ్డు మీది టీ కొట్లలో మొదలు స్టార్ హోటల్స్ లోనూ ఆ పాట మారుమోగి పోయింది. ఇక అందులోని పాటల కంపోజింగ్ చూసి ఆ రీతిన సాగాలని బప్పి కంటే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సైతం ప్రయత్నించారంటే, బప్పి మాయాజాలం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. యాంగ్రీ మేన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమితాబ్ బచ్చన్ తో చిందులు వేయించిన చిత్రం డాన్ అయినా, ఆయన చిందులకు తగ్గ డిస్కో బాణీలనూ అద్దిన సినిమా బప్పి లహిరి స్వరకల్పనలో రూపొందిన నమక్ హలాల్ అనే చెప్పాలి. ఇందులో బప్పి బాణీలకు అమితాబ్ చేసిన నాట్యం ఆయనను మరో రేంజ్ కు తీసుకు వెళ్ళింది. అలాగే షరాబీలోని పాటలకు బప్పి లహిరి సంగీతం, అమితాబ్ అభినయం పోటీగా సాగాయనీ చెప్పవచ్చు.
బప్పి బాణీలతోనే మిథున్ చక్రవర్తి స్టార్ హీరో అయ్యాడంటే అనతిశయోక్తి! బప్పి స్వరాలు సమకూర్చిన సురక్ష, వర్దత్, డిస్కో డాన్సర్, కసమ్ పైదా కర్నేవాలా, డాన్స్ డాన్స్, కమాండో, గురు వంటి చిత్రాలు మిథున్ కు నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. శ్రీదేవిని ఉత్తరాదిన స్టార్ హీరోయిన్ గా నిలిపిన హిమ్మత్ వాలా చిత్రం బప్పి లహిరి స్వరకల్పనలోనే చిందులేయించింది. అప్పటికి సన్నీ డియోల్ చిత్రాలలో మేటిగా ఘాయల్ మూవీ నిలవడానికీ బప్పి సంగీతం కూడా ఓ కారణమని చెప్పవచ్చు. హిందీలో కృష్ణ తమ పద్మాలయా పతాకంపై నిర్మించిన హిమ్మత్ వాలాతోనే ఆయనకు బప్పితో అనుబంధం కలిగింది. అప్పటి నుంచీ బప్పి స్వరాలతో కృష్ణ, ఆయన సోదరులు హిందీలో అనేక చిత్రాలు తెరకెక్కించారు. 1986లొ కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ భారీ జానపద చిత్రంగా సింహాసనంను తెరకెక్కించారు. ఈ సినిమాను ఏక కాలంలో హిందీలోనూ జితేంద్ర హీరోగా సింఘాసన్పేరుతో రూపొందించారు. ఈ చిత్రాలకు బప్పి స్వరకల్పన అటు హిందీ వారిని, ఇటు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది.
సింహాసనం తరువాత తెలుగులోనూ బప్పి లహిరి స్వరాలపై మన సినీజనం మోజు పడ్డారు. కృష్ణ, ఆయనకు సన్నిహితంగా ఉన్న సంస్థలు బప్పి లహిరి సంగీతాన్ని అనువుగా వినియోగించుకున్నాయి. ఇక చిరంజీవికి బప్పి లహిరి తొలిసారి స్వరకల్పన చేసిన చిత్రం స్టేట్ రౌడీ. ఆ తరువాత చిరంజీవికి గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్ సమకూరడంలో బప్పి బాణీలకూ ప్రాధాన్యం ఉందని చెప్పక తప్పదు. ఇక చిరంజీవి రౌడీ అల్లుడుకుకూడా బప్పి స్వరాలే ప్రాణం పోశాయి. చిరంజీవి బిగ్ బాస్కూ బప్పి సంగీతం సమకూర్చారు. బాలకృష్ణకు బప్పి లహిరి తొలిసారి సంగీతం సమకూర్చిన చిత్రం రౌడీ ఇన్ స్పెక్టర్, ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలచింది. తరువాత నిప్పురవ్వలోనూ బప్పీ బాణీలు ఆకట్టుకున్నాయి. ఇక మోహన్ బాబు రౌడీ గారి పెళ్ళాం, దొంగ పోలీస్, బ్రహ్మ, పుణ్యభూమి నా దేశం చిత్రాలకు సైతం బప్పి స్వరాలు వీనులవిందు చేశాయి. ఇవి కాక, తెలుగులో బప్పి స్వరాల్లో తేనె మనసులు, త్రిమూర్తులు, శంఖారావం, సమ్రాట్, కలెక్టర్ విజయ, మన్మథ సామ్రాజ్యం, చిన్నా, చిన్నకోడలు, ఇంద్రభవనం, రక్త తర్పణం, రౌడీ రాజకీయం, ముద్దాయి - ముద్దుగుమ్మ, ఖైదీ ఇన్ స్పెక్టర్ వంటి చిత్రాలు వెలుగు చూశాయి. 2013లో అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన యాక్షన్ 3డి చిత్రానికి బప్పి స్వరాలు అందించారు. 2020లో రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజాలో రమ్ పమ్ బమ్... అంటూ సాగే పాటలో బప్పి లహిరి గాయకునిగానూ గళం వినిపించారు.ఈ పాటలో ఆయనతో పాటు హీరో రవితేజ, గాయకుడు శ్రీకృష్ణ సైతం గొంతు కలిపారు. దక్షిణాదిన తెలుగులోనే కాదు తమిళ, కన్నడ భాషల్లోనూ బప్పి లహిరి మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
గోల్డ్ ఈజ్ మై గాడ్ అంటూ మెడ నిండా బంగారు గొలుసులు వేసుకొని కనిపించేవారు బప్పి లహిరి. ఆ తరువాతి రోజుల్లో ఎంతోమంది సంగీత దర్శకులు ఆ పంథాలోనే బంగారు గొలుసులతో దర్శనమివ్వడానికి బప్పి బాణీ కారణమయింది. ఇక అందరికీ తలలో నాలుకలా ఉండేవారు బప్పి లహిరి. తన మేనమామ కిశోర్ కుమార్ స్టార్ సింగర్ గాసాగుతున్న రోజుల్లో, మిథున్ చక్రవర్తి కి కొన్ని కారణాలవల్ల పాటలు పాడలేదు. అప్పుడు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు బప్పి. ఇక బప్పి లహిరి బెంగాలీయుల్లో అధికశాతం మంది లాగే అమ్మవారి భక్తుడు. తన భక్తితోనూ అమ్మవారిపై స్వరాలు సమకూర్చారు. ఇక హిందుత్వ అంటే ఆయనకు ప్రాణం. 2014లో బీజేపీ లో చేరారు. బెంగాల్ లోని శ్రేరాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి బీజీపే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు.
ఏది ఏమైనా భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం కల్పించుకున్నారు బప్పి లహిరి. పొడవాటి జుట్టు, మెడ నిండా బంగారు గొలుసులు, చేతి వేళ్ళకు బంగారు ఉంగరాలు, కళ్ళకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని ప్రత్యేకంగా కనిపించిన బప్పి, సంగీతమూ ప్రత్యేకమైనదే, ఆయన వ్యక్తిత్వమూ విశిష్టమైనదే. నాటి ఎంతోమంది వర్ధమాన గాయకులకు అవకాశాలు కల్పించారు. ఆయన పంథాలోనే తరువాతి తరం సంగీత దర్శకులు పలువురిని ప్రోత్సహిస్తూ సాగారు. ఏది ఏమైనా బప్పి లహిరి స్వరవిన్యాసాలను తలచుకుంటూ ఉంటే… యాద్ ఆ రహా హై... అంటూ గళం విప్పకుండా ఉండలేం.