Tollywood : మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు

Tollywood (1)

Tollywood (1)

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్స్), గిల్డ్ నిర్మాతలకు నడుస్తున్న అంతర్గత వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎవరికీ వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో సమస్య కొలిక్కి రావడం లేదు. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలో నేరుగా రంగంలోకి దిగారు. ఈ నేపధ్యంలో ఈ రోజు హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ కీలక సమావేశం నిర్వహించారు.

పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చొరవ తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన నివాసంలో ఎగ్జిబిటర్లతో గంటకు పైగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ.. “సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు ఇన్ని ఉన్నాయాఅని ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యలన్నీ పూర్తిగా సమసిపోతాయని ఆశిస్తున్నాం” అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

 దిల్ రాజు మాట్లాడుతూ.. మొన్న వేసిన కమిటీ ద్వారా అన్ని వివరాలను చిరంజీవి ముందే తెప్పించుకుని అధ్యయనం చేశారని తెలిపారు. “మేమంతా కలిసి ఇండస్ట్రీ సమస్యలను ఆయనకు వివరించాము. ఇది ఏదో ఒక ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన సమస్య కాదు.. మొత్తం పరిశ్రమకు సంబంధించిన పెద్ద సమస్య. దీనిపై మరి రెండు మూడు రోజుల్లో అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని స్పష్టం చేశారు.

ఎగ్జిబిటర్లతో సమావేశం ముగిసిన వెంటనే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా మెగాస్టార్ మరో అడుగు వేశారు. చిరంజీవి నుంచి గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు కాల్ రావడంతో  తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు మరికాసేపట్లో చిరంజీవి నివాసానికి చేరుకోనున్నారు. ఎగ్జిబిటర్ల వెర్షన్ విన్న చిరంజీవి, ఇప్పుడు గిల్డ్ నిర్మాతల అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఒక ఉమ్మడి నిర్ణయానికి రానున్నారు.

రేపు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ : 

ఈ ఇండస్ట్రీ సమస్యలకు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కూడా ఒక లైన్ క్లియర్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధి బృందం భేటీ కానుంది. ఏపీలో చిత్ర పరిశ్రమ, థియేటర్ల వ్యవస్థ బలోపేతంపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు నిర్మాతలు వినతిపత్రం సమర్పించనున్నారు.