NTV Telugu Site icon

Oscar 2023: ఆస్కార్ ఆశలు రేపుతున్న ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’!

Hollywood

Hollywood

Oscar 2023: అమెరికాలో ఇది సినిమా అవార్డుల సీజన్ అనే చెప్పాలి. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 6 న సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పలు సినిమా అవార్డుల సంస్థలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఆస్కారేతర అవార్డుల ప్రభావం ఆస్కార్స్ పై ఉంటుందనీ కొందరు చెబుతున్నారు. అయితే ప్రతీసారి ఆ మ్యాజిక్ సాగదనీ మరికొందరి మాట! ఫిలిమ్ క్రిటిక్స్ అవార్డుల ప్రదానం, సూపర్ ఛాయిస్ అవార్డుల నామినేషన్స్ హంగామా సాగగానే ‘ఎస్ఏజీ’ అవార్డులు, ‘పీజీఏ’ అవార్డులు, ‘ఎన్ఏఏసీపీజీ ఇమేజ్ అవార్డులు’ ప్రదానోత్సవాలు వరుసగా జరిగాయి.

ఈ మూడు అవార్డుల ప్రదానోత్సవంలోనూ కొన్ని విశేషాలు చోటు చేసుకున్నాయి. అదలా ఉంచితే, ఆస్కార్ బరిలో 11 నామినేషన్స్ సంపాదించి, ఈ సారి సంచలనం సృష్టించిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సినిమాకు ‘ఎస్ఏజీ’, ‘పీజీఏ’ అవార్డుల్లోనూ అంబరమంటే ఆనందం సొంతమయింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ బరిలోనూ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సందడి చేయడం ఖాయం అంటూ అంచనాలు సాగుతున్నాయి. ఈ సినిమాపై బెట్టింగ్ రాయుళ్ళు కూడా బాగానే బెట్స్ వేస్తున్నారట!

ఎస్.ఎ.జి. (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు)లో నాలుగు ప్రధానమైన అవార్డులను ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కే హుయ్ కువాన్ ఎంపికకాగా, బెస్ట్ ఫిమేల్ సపోర్టింగ్ యాక్టర్ గా ఇదే చిత్రంలో నటించిన జామీ లీ కర్టిస్ ఎన్నికయ్యారు. ఇక ఈ సినిమాలో తనదైన అభినయంతో ఆకట్టుకున్న మిచెల్లీ యెవోహ్ ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే ఈ సినిమా ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై క్యాస్ట్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇక ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్స్’ (పీజీఏ)లోనూ అత్యుత్తమ చిత్రంగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ నిలచింది. దీంతో ఈ సినిమాపైనే అందరి చూపు సాగుతోంది. పదకొండు ఆస్కార్ నామినేషన్స్ సంపాదించిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ కనీసం ఆరు అవార్డులు దక్కించుకుంటుంది అని పలువురు భావిస్తున్నారు. దీనిపై కూడా బెట్టింగ్స్ సాగుతున్నాయి.