Site icon NTV Telugu

Sharmila Tagore :75 ఏళ్ళ వయసులో షర్మిలా టాగోర్ నటన!

Amul1

Amul1

షర్మిలా టాగోర్ ఒకప్పుడు ఆసేతు హిమాచల పర్యంతం అభిమానగణాలను సంపాదించి, ఎందరో రసికుల కలలరాణిగా జేజేలు అందుకున్నారు. షర్మిల నటించిన ప్రేమకథా చిత్రాలు చూసి, ఆమె వీరాభిమానులుగా మారినవారెందరో! ఆమెపై అభిమానంతో తమ ఆడపిల్లలకు ‘షర్మిల’ అని నామకరణం చేసిన వారూ లేకపోలేదు. అంతలా ఆ రోజుల్లో అభిమానులను ఆకట్టుకున్న షర్మిలకు ప్రస్తుతం 75 ఏళ్ళ వయసు. ఆమె తనయుడు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సైతం తల్లి బాటలో పయనించి, నటులుగా అలరించారు. అందులో ఏ విశేషమూ లేదు కానీ, ఈ వయసులో మళ్ళీ షర్మిలా టాగోర్ తెరపై కనిపించడమే ఇప్పటి విశేషం! ఈ విషయాన్ని సైఫ్ కూతురు సారా అలీఖాన్ తెలిపింది.

షర్మిలా టాగోర్ ను మళ్ళీ నటింప చేయాలని ఎంతోమంది భావించారు. అయితే ఆ నవ్వుల రాణి సదరు అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు. కానీ, ఈ వయసులో తనకు తగ్గ పాత్ర లభించడంతో ఆమె నటించడానికి అంగీకరించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తోన్న ‘గుల్ మొహర్’లో షర్మిల నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ తెలియజేసింది. ఎప్పుడెప్పుడు తన నాన్నమ్మను తెరపై చూద్దామా అన్న ఆసక్తి ఉందనీ సారా అంటోంది. రోజూ చూసే నాన్నమ్మను తెరపై చూడాలన్న ఆసక్తి సారాకే అంతలా ఉంటే, ఆమెను కొన్ని దశాబ్దాలుగా ఆరాధిస్తున్న అభిమానులకు మరెంత ఆసక్తి ఉంటుందో వేరే చెప్పాలా!? రాహుల్ చిట్టెల్ల రూపొందిస్తున్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్ పాయ్, అమోల్ పాలేకర్, సూరజ్ శర్మ, సిమ్రాన్ నటిస్తున్నారు. 34 ఏళ్ళుగా తాము నివసిస్తున్న ఓ భవనాన్ని వీడిపోవాల్సిన పరిస్థితి బాత్రా కుటుంబానికి కలుగుతుంది. ఆ సమయంలో వారి బంధాలు, అనుబంధాల మధ్య ‘గుల్మొహర్’ కథ సాగుతుందట! ఇందులో ఇంటిపెద్ద పాత్రలో షర్మిల కనిపించనున్నారు. మరి ‘గుల్ మొహర్’లో ఆ నాటి నవ్వుల రాణి షర్మిల అభినయం ఈ తరం వారిని ఏ తీరున అలరిస్తుందో చూడాలి.

Exit mobile version