Ellamma: సంగీత దర్శకుడిగా ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌లతో ప్రేక్షకులను అలరించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. డీఎస్పీ యాక్టింగ్ కెరీర్‌కి ఈ మూవీ టర్నింగ్ అవుతుందని భావిస్తున్నారు. 47వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో దేవి శ్రీ ప్రసాద్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించారు. భుజాల వరకు పెరిగిన జుట్టు, వింటేజ్ స్టైల్ గెటప్, పల్లెటూరి వేషధారణ, చేతిలో సంప్రదాయ కిరీటంతో ఆయన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్‌తో పాటు వినిపించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటోంది.
‘బలగం’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘ఎల్లమ్మ’ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ మ్యూజికల్, ఎమోషనల్ సోషల్ డ్రామాగా రూపొందుతోంది. చిందు యక్షగాన కళాకారుల జీవితం, జానపద సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, అమ్మ సెంటిమెంట్, పల్లెటూరి ప్రేమకథను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ దేవత ఎల్లమ్మకు స్థానిక కళాకారుల కుటుంబాలకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం కూడా కథలో కీలక అంశంగా ఉండనుంది.
ఈ మూవీని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ప్రణాళికతో చిత్రబృందం ముందుకెళ్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది. ఇదే రోజున మరో ఆసక్తికరమైన ప్రకటన కూడా వెలువడింది. నాగార్జున అక్కినేని ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’కు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే నాగార్జునతో కలిసి ‘మన్మధుడు’, ‘మాస్’, ‘కింగ్’, ‘కుబేర’ వంటి చిత్రాలకు గుర్తుండిపోయే సంగీతాన్ని అందించిన డీఎస్పీ, మరోసారి ఆ కాంబినేషన్‌లో చేరడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
ఒకే రోజున సంగీత దర్శకుడిగా మరో భారీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడం, మరోవైపు హీరోగా తొలి చిత్రం ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం డీఎస్పీ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చింది. సంగీతంలో తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు నటుడిగానూ అదే స్థాయిలో ఆకట్టుకుంటారా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఆయనకు ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, వేణు యెల్దండి కథలపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం కలిసి ‘ఎల్లమ్మ’ను ఇప్పటికే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

