మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ చిక్కుల్లో చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈయనకు నోటీసులు జారీ చేసింది. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి ఈయన మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు వచ్చిన నేపథ్యంలో.. అధికారులు ఆయనకు నోటీసులు పంపారు. దీంతో, వచ్చే వారం ఈయన్ను కొచ్చి కార్యాలయంలో అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. కాగా.. గత సెప్టెంబర్‌లో కేరళ పోలీసులు ప్రజల్ని రూ. 10 కోట్ల మేర మోసం చేశాడన్న ఆరోపణలపై మాన్సన్ మాన్కల్‌ను అరెస్ట్ చేశారు. ఓసారి అతని ఇంటికి మోహన్ లాల్ వెళ్లారని సమాచారం. అయితే, ఆయన అలా వెళ్ళడం వెనుక గల కారణాలేంటో తెలియరాలేదు.
ఇదిలావుండగా.. కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ.. వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడని కేరళ పోలీసులు వెల్లడించారు. తన వద్ద టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని మాన్కల్ చెప్పిన మాటలన్నీ అబద్ధమేనని అధికారులు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్‌ను కూడా కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.