NTV Telugu Site icon

Dulquer salmaan: రొమాంటిక్ హీరో అనే పదం విసుగు తెప్పించింది

Sitharamam

Sitharamam

Dulquer salmaan:దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా అశ్వినీదత్ నిర్మించిన ‘సీతారామం’ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను ఇందులో సుమంత్, రశ్మిక మండన్న, భూమికా చావ్లా, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ తదితరులు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఇందులో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, ”అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హను ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తుండి పోయే ఎపిక్ మూవీ. ఇలాంటి కథని ఎట్టి పరిస్థితిలో వదులకూడదనిపించింది. చివరి ప్రేమకథగా ‘సీతారామం’ లాంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ మూవీ షూటింగ్ అద్భుతమైన అనుభవం. దేశంలోని అనేక ప్రదేశాలలో షూట్ చేశాం. అందులో చాలా ప్రదేశాలు నేను ఎప్పుడూ చూడలేదు. కథని బలంగా నమ్మాం. అందరం వంద శాతం బెస్ట్ ఇచ్చాం. అశ్వినీదత్ గారి లాంటి సినిమాపై ప్యాషన్ వున్న నిర్మాతతో ఇప్పటివరకూ పని చేయలేదు. అన్ని సదుపాయాలూ సమకూర్చారు. హను సినిమాపై గ్రేట్ పేషన్ వున్న రచయిత, దర్శకుడు. ఆయనకి సినిమా తప్పితే మరో ద్యాస లేదు. ‘సీతారామం’ లార్జర్ దెన్ లైఫ్ సినిమా” అని అన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ, ”ఈ సినిమా బాగా వర్షం వచ్చినపుడు వేడి కాఫీ తాగినట్లు వుంటుంది. ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు వుంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇది రాసివ్వగలను. ఈ సినిమా మీతో పాటు వచ్చేస్తుంది” అని చెప్పారు.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన తొలి తెలుగు సినిమా అనుభవాలను చెబుతూ, ”దర్శకుడు హను జీనియస్. ఈ కథని చెప్పినపుడు సీత, రామ్ ప్రేమలో పడిపోయాను. నిర్మాత అశ్వినీదత్ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. సెట్ లో ప్రతిరోజు ఒక అందమైన కలలా వుండేది. సీత పాత్ర అద్భుతంగా వుంటుంది. ఆ పాత్రలో రొమాన్స్ కూడా వుంది. ఈ మధ్య కాలంలో రొమాంటిక్ సినిమాలు తగ్గిపోతున్నాయి. ‘సీతారామం’ మ్యాజికల్ రొమాంటిక్ మూవీ అనుకోవచ్చు” అని అన్నారు. స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ, ”ఒక అందమైన ప్రేమ కథ చెప్పాడానికి కథకుడు వుండాలి. కథ ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి. ఇందులో నాది అదే పాత్ర” అని తెలిపింది.

రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, ”మా నాన్నగారు మూకీ నుండి సినిమాల్లో భాగమయ్యారు. ప్రసాద్స్ అనేది సినిమా కోసం ఏర్పడిన సంస్థ. సినిమా కరోనాతో గడ్డుకాలం ఎదుర్కొంది. అయితే గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ప్రేక్షకుల ప్రేమతో కష్టకాలాన్ని అధిగమించింది. త్వరలో జనం ముందుకు రాబోతున్న ‘సీతారామం’ యూనిట్ కి ఆల్ ది బెస్ట్” అని అన్నారు. కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రష్యా లాంటి ప్రదేశాల్లో సాహసించి షూటింగ్ చేశామని, దీనిని చూసి ఎంజాయ్ చేసి సూపర్ సక్సెస్ ని ఇస్తారనే నమ్మకం ఉందని నిర్మాత అశ్వినీదత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఓ దృశ్య కావ్యం లాంటిదని సుమంత్ చెప్పారు.