Dulquer Salmaan Birthday Special:
అనేక విధాల తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు దుల్కర్ సల్మాన్. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడిగా చిత్రసీమలో అడుగు పెట్టినా, తన ప్రతిభతోనే ఒక్కోమెట్టూ ఎక్కుతూ స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు దుల్కర్. నటునిగా, గాయకునిగా, నిర్మాతగా దుల్కర్ తనదైన పంథాలో సాగుతున్నాడు.
దుల్కర్ సల్మాన్ 1978 జూలై 28న జన్మించాడు. తండ్రి మమ్ముట్టి మళయాళ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ సాగుతుండగా, దుల్కర్ మనసు సైతం సినిమా రంగంపైకి మళ్ళింది. పర్డ్యూ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేసిన దుల్కర్ కొద్ది రోజులు దుబాయ్ లో బిజినెస్ మేనేజర్ గా పనిచేశాడు. ‘బ్యారీ జాన్ స్టూడియో’లో మూడు నెలల యాక్టింగ్ కోర్సు చేశాడు దుల్కర్. 2012లో ‘సెకండ్ షో’ అనే సినిమాతో దుల్కర్ హీరోగా పరిచయం అయ్యాడు. అదే యేడాది అతను నటించిన ‘ఉస్తాద్ హోటల్’లోనూ నటునిగా మంచి మార్కులు సంపాదించాడు. ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు దుల్కర్. తరువాత నుంచీ మళయాళంలోనే కాకుండా తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలోనూ నటించడం మొదలు పెట్టాడు.
తమిళ చిత్రం ‘వాయై మూడి పేసవుమ్’ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించాడు దుల్కర్. దాంతో మణిరత్నం ‘ఓ కాదల్ కన్మణి’లోనూ నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో అనువాదమయింది. ఈ చిత్రంతో తెలుగువారిని ఆకట్టుకున్నాడు దుల్కర్. 2018లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’లో జెమినీగణేశన్ గా నటించి మంచి మార్కులు సంపాదించాడు. ‘మహానటి’ నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థనే తెరకెక్కించిన ‘సీతారామం’ తెలుగు చిత్రంలోనూ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 5న జనం ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఏ రీతిన అలరిస్తాడో చూడాలి.
