NTV Telugu Site icon

Tollywood: మళ్ళీ తెలుగు సినిమాకు ‘డబ్బింగ్ దడ’!

Avatar

Avatar

Tollywood: థియేటర్ల సందడి బాగా తగ్గిందనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, టాక్ బాగున్నా, మునుపటిలా అన్ని కేంద్రాలలో వంద శాతం వసూళ్ళు కనిపించడం లేదు. ఇక చిన్నచిత్రాల పరిస్థితి సరేసరి! ఈ నేపథ్యంలో సినిమాలు రిలీజ్ చేయడానికే సినీజనం భయపడిపోతున్నారు. ఓటీటీల పుణ్యమా అని చిన్న చిత్రాలకు ఓ క్రేజ్ లభించింది. అయితే, ఇప్పుడు ఓటీటీల ఓనర్స్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కాసింత పేరున్న హీరో, హీరోయిన్ సినిమాలనే నేరుగా తమ ప్లాట్ ఫామ్స్ పై విడుదల చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. తాము కొనుగోలు చేయాలనుకున్న చిన్న చిత్రాలు తప్పకుండా థియేట్రికల్ రిలీజ్ కావాలనే నిబంధన కూడా విధించారు. దీంతో చిన్న చిత్రాలు తప్పకుండా థియేటర్ల వైపు పరుగులు తీయాల్సి వస్తోంది. తద్వారా చిన్న చిత్రాల నిర్మాతలు థియేటర్లకు రెంట్ చెల్లించాలి. వారు చెల్లిస్తోన్న అద్దె స్థాయిలో సైతం వారి చిత్రాల వసూళ్ళు లేకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక ఆట, రెండు ఆటలకు మాట్లాడుకొని సినిమాలు విడుదల చేస్తున్నారు.

నటసమ్రాట్ అక్కినేని నలభై ఏళ్ళ క్రితం నటించిన ‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని ఏకంగా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నా, ఆ సినిమాకు హైదరాబాద్ లో మూడంటే మూడు థియేటర్లు లభించాయి. అందులోనూ ఒక్కో థియేటర్ లో ఒక్కో ఆట చొప్పున ఆ సినిమా ప్రదర్శితమయింది. కొందరు టాప్ హీరోస్ మాత్రం తమ చిత్రాలను తమ బర్త్ డేస్ కు లేదా, సదరు చిత్రానికి సంబంధించిన ప్రత్యేక తేదీలలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ అలా ఉంచితే, ఈ యేడాది స్పష్టంగా కనిపించిన వైనం ఏమిటంటే, కన్నడ భాష నుండి అనువాదమైన ‘కేజీఎఫ్-2, కాంతారా’ చిత్రాలు జనాన్ని ఆకర్షించాయి. ఇది మన తెలుగు సినిమా జనాన్ని మరింత అయోమయంలో పడేసింది. ఒకప్పుడు తమిళ అనువాదాల ముందు మన స్టార్ హీరోస్ సినిమాలు సైతం కుదేలయిపోయిన సందర్భాలున్నాయి. ఆ రోజుల్లో రజనీకాంత్ డబ్బింగ్ మూవీస్ కు తెలుగునాట భలే డిమాండ్ ఉండేది. కన్నడ అనువాదాల గురించి ఎవరూ అంత ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పుడు సీన్ మారిపోయింది. కన్నడ అనువాదాల్లోనూ విషయమున్న చిత్రాలను తెలుగువారు భలేగా ఆదరిస్తూ ఉండడంతో మనవాళ్ళ చూపు అటువైపు సాగుతోంది.

“యశోద, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, ఇన్ సెక్యూర్డ్, గాలోడు, సీతారామపురంలో ఒక ప్రేమజంట, ప్రేమదేశం” వంటి చిత్రాలు నవంబర్ లోనే వెలుగు చూడనున్నాయి. అయితే ఈ సినిమాల్లో ఏ టాప్ స్టార్ మూవీస్ లేకపోవడం గమనార్హం! తరువాత డిసెంబర్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. జనవరిలో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ సినిమాలు రావడానికి సిద్ధం కావడంతో కొందరు తమ చిత్రాలను ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకని డిసెంబర్ లో టాలీవుడ్ టాప్ స్టార్స్ తమ చిత్రాలను విడుదల చేయడానికి ఇష్టపడడం లేదు అంటే హాలీవుడ్ నుండి వస్తోన్న భారీ చిత్రం ‘అవతార్-2’ కారణమని అందరూ చెబుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 16న ఒరిజినల్ ఇంగ్లిష్ తో పాటు అనేక భారతీయ భాషల్లో అనువాద రూపంలో విడుదలవుతోంది. అంటే ఈ చిత్రం అనువాద రూపంలో తెలుగు సినీజనాన్ని భయపెడుతోందన్న మాట! ఇలా అనువాద చిత్రాలు మన టాప్ స్టార్స్ కు సైతం వణుకు పుట్టేలా చేయడం చూస్తోంటే గతం గుర్తుకు రాకమానదు. అయితే ఆ రోజుల్లోనూ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోస్ చిత్రాలు ఘనవిజయాలు సాధించి, మళ్ళీ మన తెలుగు సినిమా మార్కెట్ కు కొత్త వెలుగు తెచ్చాయి. అదే తీరున రాబోయే జనవరి తెలుగు సినిమాకు మంచి చేయనుందనీ సినీజనం ఆశిస్తున్నారు. ఆ తీరున చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలే తెలుగు చిత్రాలకు మళ్ళీ మునుపటి వెలుగు తెస్తాయనీ పలువురు ఆశిస్తున్నారు.