సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరుత, మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన నటనలో సత్తా చాటాడు. ఇక డ్యాన్స్ లోనూ తిరుగు లేదన్పించిన చెర్రీ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు చరణ్. ఈరోజు చరణ్ 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎన్టీవీ రీడర్స్ కోసం…
Read Also : HBD Ram Charan : స్పెషల్ పిక్ షేర్ చేసిన చిరు… వింతగా ఉందట !!
స్వాతంత్ర్య పోరాటంలో…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ నిజానికి అలాంటి కుటుంబం నుంచి వచ్చినవారే. ఆయన తాత అల్లు రామ లింగయ్య భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్న వైద్యుడు. క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో ఆయనను బ్రిటీష్ వారు అరెస్టు చేశారు కూడా. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి హాస్యనటుడిగా ఆయన చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
స్టంట్స్ లో నైపుణ్యం
2016లో వచ్చిన రామ్ చరణ్ హిట్ యాక్షన్ చిత్రం “ధృవ” తమిళ చిత్రం ‘తని ఒరువన్’కి రీమేక్. ఈ చిత్రంలో చరణ్ ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేశాడు.
ఎయిర్‌లైన్ కంపెనీ
సాధారణంగా సెలబ్రిటీలు వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ లను తీసుకుంటారని మనం వింటూనే ఉంటాము. కానీ చరణ్ కు ఏకంగా ఎయిర్‌లైన్ కంపెనీలో వాటా ఉంది. Turbo Megha Airways Pvt Ltd అనేది హైదరాబాద్‌లో ఉన్న ప్రాంతీయ విమానయాన సంస్థ. ఇది గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల్లో పెద్ద ఎయిర్‌లైన్స్‌కు కూడా సహాయపడుతుంది. ఈ ఎయిర్‌లైన్ కంపెనీకి రామ్ చరణ్ ఛైర్మన్.
వ్యవస్థాపకుడు, పరోపకారి
రామ్ చరణ్ నటుడు మాత్రమే కాదు పారిశ్రామికవేత్త, పరోపకారి కూడా. చెర్రీకి సొంతంగా పోలో టీం కూడా ఉంది. దాని పేరు రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్.
యాక్టింగ్ స్కూల్
రామ్ చరణ్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్ కోర్స్ చేశాడు. హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ కూడా ఇదే యాక్టింగ్ స్కూల్ లో కోర్స్ చేశారు.
