నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు. లైట్ బోయ్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. సినిమాటోగ్రఫీతోనూ అలరించారు. దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా యువతను ఆకట్టుకోవడంతోనే సాగారు తేజ.
జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన తండ్రి జె.బి.కె.చౌదరికి చిత్రసీమలో సత్సంబంధాలు ఉండేవి. తేజ పినతండ్రి జాస్తి మాధవరావు ప్రముఖ మేకప్ మేన్. బాల్యంలోనే తండ్రి కన్నుమూయడంతో తేజ పలు పాట్లు పడి చివరకు కోరుకున్న చిత్రసీమలో అడుగు పెట్టారు. లైట్ బోయ్ గా మొదలు పెట్టి, అంచెలంచెలుగా సాగారు. చిత్రసీమ తేజకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. దాంతో పాటు సమతా భావాన్నీ అలవాటు చేసింది. అందుకే తేజ కులం, మతం, ప్రాంతం అన్నవాటిని ఏ మాత్రం విశ్వసించరు సరికదా, వాటికి ఆయన బద్ధ వ్యతిరేకి! రామ్ గోపాల్ వర్మ ఆరంభంలో తెరకెక్కించిన చిత్రాలకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి అలరించారు. రామ్ గోపాల్ వర్మ ‘రాత్రి’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాక బాలీవుడ్ బాట పట్టారు తేజ.
బాలీవుడ్ లో తేజను మంచి మంచి అవకాశాలు పలకరించాయి. ఆమిర్ ఖాన్ హీరోగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ‘బాజీ’ చిత్రానికి తేజ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాక, “గులామ్, సంఘర్ష్, జిస్ దేశ్ మే గంగా రహతా హై, క్రోధ్, క్రిష్ణ, రక్షక్, తేరే మేరే సప్నే” వంటి చిత్రాలకు ఛాయాగ్రహణ దర్శకునిగా అవకాశాలు లభించాయి. ఈ చిత్రాలతో తేజకు బాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు లభించింది. అదే సమయంలో మాతృభాష తెలుగులో దర్శకునిగా రాణించాలన్న ఆలోచన కలిగింది. అప్పట్లో రామోజీ ఫిల్మ్ సిటీ నెలకొల్పి తమ ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై వరుసగా చిత్రాలను నిర్మిస్తున్నారు రామోజీరావు. ఈ నేపథ్యంలో ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ప్రతినిధులకు తేజ ఓ కథ వినిపించారు. యువతను ఆకట్టుకొనే అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్న ‘చిత్రం’ను నిర్మించడానికి రామోజీరావు నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ‘చిత్రం’ ద్వారా ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇదే సినిమాతో రీమా సేన్ నాయికగా తెలుగువారి ముందు నిలచింది. ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది.
అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. పెట్టుబడికి రెండింతలు రాబడి చూసింది. ఈ సినిమా విజయం తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో తేజ పరపతి పెరిగింది. ఆ సంస్థ నిర్మించిన కొన్ని చిత్రాలకు పర్యవేక్షకునిగానూ పనిచేశారు. బయటకు వచ్చి ‘నువ్వు -నేను’ చిత్రం తెరకెక్కించారు తేజ. ఈ సినిమాకు జెమినీ కిరణ్ నిర్మాత. ఈ సినిమా రాబడిలో తేజ భాగస్వామ్యం తీసుకున్నారు. తేజ చిత్రాలకు సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, గీత రచయిత కులశేఖర్ టీమ్ గా పనిచేశారు. తొలి రెండు చిత్రాలతోనే విజయం సాధించిన ఈ టీమ్ తరువాత ‘జయం’ను తెరకెక్కించింది. ఈ సినిమా ద్వారా నితిన్ హీరోగా, సదా నాయికగా జనం ముందు నిలిచారు. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. వరుసగా మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన తేజకు యూత్ లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. దాంతో తేజ స్థాయి కూడా పెరిగిపోయింది. మహేశ్ బాబు, తేజ రూపొందించిన ‘నిజం’లో నటించి, ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించారు. ఆ తరువాత నుంచీ తేజ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే తన చిత్రాల ద్వారా తేజ ఎవరో ఒకరిని పరిశ్రమకు పరిచయం చేస్తూ వచ్చారు. తేజ ‘లక్ష్మీ కళ్యాణం’ ద్వారానే కాజల్ అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమయ్యారు.
తేజ పలు ప్రయత్నాలు చేసినా, ఎందుకనో అవి మునుపటిలా ఆకట్టుకోలేకపోయాయి. తేజ పని అయిపోయింది అన్నారు చాలామంది. అలా అన్నవారి నోళ్ళు మూయిస్తూ, 2017లో రానా, కాజల్ జంటగా తేజ “నేనే రాజు- నేనే మంత్రి” రూపొందించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత తేజ రూపొందించిన ‘సీత’లోనూ కాజల్ నాయికగా నటించారు. అయితే ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కొత్తవారిని తెరకు పరిచయం చేయడంలో తేజ ఆనందిస్తూ ఉంటారు. అంతేకాదు, పాత కథను కూడా కొత్తకోణంలో చెప్పి ఆకట్టుకోవడం తేజకు వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నంలోనే సాగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవై రెండేళ్ళ క్రితం ‘చిత్రం’తో యువతను అలరించడం ఆరంభించిన తేజ, ఈ తరం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.