Site icon NTV Telugu

Bheemla Nayak: పవన్ ‘బాగా తీయ్, బాధ్యతగా చేయ్’ అన్నారు: సాగర్‌ చంద్ర

sagar k chandra

sagar k chandra

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర తన అనుభవాలను సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఇది మలయాళ రీమేక్ అయినా ఈ మూవీని చూసి వారే మళ్ళీ దీనిని రీమేక్ చేసేలా తాము మార్పులు, చేర్పులూ చేశామన్నారు. పవన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాని స్పాన్ పెరిగిందని, అలాంటి సమయంలో త్రివిక్రమ్ గారు ఇచ్చిన సజెషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. రచయితగా, దర్శకుడిగా ఆయన సీనియారిటీ తమందరికీ ప్లస్ అయ్యిందని చెప్పారు. ఆయన సహకారం లేకపోతే ‌చిత్రం ఇంత పెద్ద హిట్‌ అయ్యేది కాదని తెలిపారు. సినిమా షూటింగ్ ఆరంభానికి ముందు ‘వకీల్ సాబ్’ సెట్ లో పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుంటూ, ”అప్పుడు కోర్టు రూమ్ సీన్స్ తీస్తున్నారు. వన్ టూ వన్ ఆయనతో మాట్లాడాను. ‘బాగా తీయ్‌.. బాధ్యతగా పని చేయ్‌’ అని చెప్పారు. ఆ మాటలను మనసులో పెట్టుకుని, అంతా ఎనర్జీతో పని చేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందరికీ తెలిసిందే” అని అన్నారు.

ఇంతవరకూ తాను దర్శకత్వం వహించిన మూడు చిత్రాల గురించి సాగర్ కె చంద్ర తెలియచేస్తూ, ”తొలి చిత్రం ‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప ఇంకేం తెలీదు. ప్రొడక్షన్‌ ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అనే సంగతి తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ టైమ్ కు పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఇక తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాల వల్ల నాకు మంచే జరిగింది” అని చెప్పారు. ఈ సినిమా విజయంతో అందుతున్న ప్రశంసల గురించి మాట్లాడుతూ, ”ఒక సినిమా సక్సెస్‌ అయితే ‘తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు’ అని సినిమా టీమ్‌ చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ల నంబర్‌ జనాలకు ఎలా తెలుసని నవ్వుకునేవాడిని. ఇప్పుడు దానికో లాజిక్‌ ఉందని అర్థమైంది. తాజాగా ఆ అనుభవం నాకు ఎదురైంది. చాలామంది ఫోన్‌ చేసి మెచ్చుకుంటున్నారు. సినిమా చూసి సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, క్రిష్‌ వంటి దర్శకులు ఫోన్‌ చేసి కమర్షియల్‌ హిట్‌ కొట్టావ్‌ అని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు. త్వరలోనే ‘భీమ్లా నాయక్’ హిందీలోనూ విడుదల కాబోతోందని చెప్పారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ, ” ‘భీమ్లా నాయక్‌’ సినిమా కంటే ముందు వరుణ్‌తేజ్‌తో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. అనుకున్న బడ్జెట్‌ దాటడంతో అది పక్కకు వెళ్లింది. తర్వాత ఆ కథతో చేస్తానా.. ఇంకోటి చేస్తానా అన్నది చూడాలి” అని అన్నారు.

Exit mobile version